కుష్టు బాధితుల్లో సగానికిపైగా మన దేశంలోనే

Feb 10,2024 00:21

ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది
ప్రజాశక్తి – దుగ్గిరాల :
కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం గాంధీజీ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 30 తేదీ నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కుష్టు వ్యాధి నిర్మూలన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వైద్య సిబ్బంది, ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటికీ తిరిగి సర్వే చేస్తున్నారు. దాదాపు 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో కుష్టి వ్యాధి నిర్మూలన అంత సులభం కాదని డబ్ల్యూహెచ్‌ఒ అభిప్రాయపడుతోంది. అందుకు తగిన కారణాలు లేకపోలేదు. ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోని ఈ వ్యాధి అధికంగా ప్రబులుతోంది. బంగ్లాదేశ్‌, కాంగో, ఇథియోపియా, మడగాస్కర్‌, మయన్మార్‌, శ్రీలంక, నేపాల్‌, నైజీరియా, ఫిలిఫైన్స్‌, సూడాన్‌ తదితర దేశాల్లో కుష్టు బాధితులు అధికమని డబ్ల్యూహెచ్‌ఒ తెలిపింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 16,5459 కేసులు ఉండగా మరో 17,487 కేసులు నమోదయ్యాయి. అందులో 39 శాతం మహిళలు, 3 శాతం పిల్లలు ఉన్నారు. ఇందులో 57 శాతం కేసులు మన దేశంలోనే నమోదైనట్లు తెలిపింది.ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2022 మార్చి 31వ తేదీ నాటికి 123 కేసులు ఉండగా ఏప్రిల్‌ ఒకటి 2023 నుండి ఇప్పటివరకు 115 కొత్త కేసులు నమోదయ్యాయి. 131 మంది పూర్తిగా వైద్యం పొందారు. ప్రస్తుతం జిల్లాలో 105 మంది వ్యాధిగ్రస్తులు చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం చేపట్టిన సర్వేలో ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

దుగ్గిరాల మండలంలోని దుగ్గిరాల పిహెచ్‌సి పరిధిలో 8, ఈమని పిహెచ్‌సి పరిధిలో 10 కేసులు ఉన్నాయి. 2023 డిసెంబర్‌ 28 నుండి 2024 జనవరి 12 వరకు ఎల్సీడిసి లెప్రసీ డిసీస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ సర్వేలో దుగ్గిరాల పిహెచ్‌సి పరిధిలో 1, ఈమని పిహెచ్‌సి పరిధిలో 2 కేసులు నమోదయ్యాయి. దీనితో ప్రస్తుతం మండల వ్యాప్తంగా 22 కేసులున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పక్షోత్సవాల సందర్భంగా ఇంటింటికీ తిరిగి కుష్టు వ్యాధి లక్షణాల్లో ఒకటైన శరీరంపై మచ్చలు పరిశీలిస్తున్నట్లు దుగ్గిరాల పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్‌ సి.ఇందిర తెలిపారు.
శరీరంపై రాగి రంగు, తెలుపు, స్పర్శ, నొప్పి లేని మచ్చలు ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు. 1873లో నార్వే శాస్త్రవేత్త గెరహాల్డ్‌ హేన్రిక్‌ ఆర్మూర్‌ హాన్సన్‌ ఈ వ్యాధికి కారణం మైక్రో బాక్టీరియం అనే బ్యాక్టీరియా అని కనుగొన్నారు. చికిత్స పొందని వ్యక్తి తుమ్మినా, దగ్గినా దానిద్వారా ఇతరులకు సోకుతుంది. ఎమ్‌డిఎం మల్టీ డ్రగ్‌ థెరపీ మూడు రకాల మందుల కలయిక కల టాబ్లెట్లు నోవార్టీస్‌ అనే స్విజర్లాండ్‌ కంపెనీ మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉచితంగా అందిస్తోంది. ప్రారంభ దశలో శరీరంపై రెండు నుండి ఐదు మచ్చలుంటే ఆరు నెలలు.. అంతకన్నా ఎక్కువ ఉంటే ఏడాదిపాటు వైద్యం పొందాల్సి ఉంటుంది. సకాలంలో వైద్యం అందకపోతే శరీర ఆకృతిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. నాడీ వ్యవస్థపై, ముక్కు, గొంతుతో పాటు శాశ్వత వైకల్యం కలుగుతుంది.

➡️