కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలి : సిపిఐ

Mar 31,2024 21:36

సమావేశంలో మాట్లాడుతున్న ముప్పాళ్ల నాగేశ్వరరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పాలని, ఈ ఎన్నికల్లో ‘ఇండియా’ బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ ప్రాంతీయ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. సమావేశానికి సిపిఐ నాయకులు యు.రంగయ్య అధ్యక్షత వహించగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ బలపరిచిన అభ్యర్థులను గెలిపించా లన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడ్డ ప్రాంతాలకు నిధులు, రాజధాని నిర్మాణం,, విశాఖ రైల్వే జోన్‌, కడప ఉక్కు పరిశ్రమ ఇవ్వకుండా బిజెపి ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఎందరో ప్రాణ త్యాగాలతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కార్పొరేట్‌ శక్తులకు అమ్మేందుకు యత్నిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులం టున్నా బిజెపి నోరు మెదపడం లేదన్నారు. బిజెపికి అనుకూలంగా ఉన్న పార్టీలు అవినీతి అక్రమాలకు పాల్పడినా చర్యలుండవని, వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలు, నాయకులపై ఈడి, సిబిఐ కేసులు బనాయిస్తూ జైళ్లలో పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అంబానీ, అదాని వంటి కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీలను చీలుస్తున్నారన్నారు. మతోన్మాదంతో దళిత, మైనారిటీలపై దాడులు చేస్తున్నారని, కులాల, మత ఘర్షణలతో ప్రజల్లో చిచ్చు పెడుతున్నారని చెప్పారు. సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ బిజెపిని, దాన్ని అనుసరించే పార్టీలను రానున్న ఎన్నికల్లో ఓడించాలన్నారు. ప్రజాస్వా మ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ‘ఇండియా’ బ్లాక్‌ ద్వారానే సాధ్యమన్నారు. సమావేశంలో నాయకులు షేక్‌ హుస్సేన్‌, కాసా రాంబాబు, చక్రవరం సత్యనారాయణ రాజు, వైదన వెంకట్‌, అంజిరెడ్డి, ఎస్‌.దేవి పాల్గొన్నారు.

➡️