కేన్సర్‌ స్క్రీనింగ్‌ అంబులెన్స్‌ ప్రారంభం

Jan 10,2025 20:53

ప్రజాశక్తి-శృంగవరపుకోట :   చీడిపాలెం గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు రహదారి నిర్మాణానికి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ స్థల పరిశీలన చేశారు. ఆయన శుక్రవారం ఎస్‌.కోట మండలంలో పర్యటించారు. జాతీయ రహదారి 516-ఇ నుంచి చీడిపాలెం గ్రామానికి రహదారి వేయాలని ఇటీవల కలెక్టర్‌కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. దీంతో ఆయన ఈ గ్రామానికి ప్రస్తుతం ఉన్న గ్రావెల్‌ రహదారిని పరిశీలించారు. తాహశీల్దార్‌ అరుణకుమారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మ్యాప్‌లను పరిశీలించారు. సర్వే చేసి రహదారి నిర్మాణానికి స్థల సేకరణకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఆదేశించారు. అనంతరం అక్కడికి సమీపంలోని సాయిపల్లిని కలెక్టర్‌ సందర్శించారు. శ్రీ సత్యసాయి దివ్యామృతం ఆశ్రమంలో నిర్మాణంలో ఉన్న వంద పడకల కేన్సర్‌ ఆసుపత్రిని, ఓపి గదులను, భోజన శాలను పరిశీలించారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. శారదా మెటల్స్‌ అండ్‌ అల్లాయిస్‌ లిమిటెడ్‌ కంపెనీ సమకూర్చిన కేన్సర్‌ స్క్రీనింగ్‌ అంబులెన్స్‌ను కలెక్టర్‌ ప్రారంభించారు. సాయిపల్లికి రహదారి సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నన్నయ విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ముర్రు ముత్యాలనాయుడు, తాహశీల్దార్‌ అరుణకుమారి, డిప్యూటీ తాహశీల్దార్‌ భరత్‌, సాయిపల్లి ఆశ్రమ స్వామీజి, ఇతర ప్రతినిధులు, శారదామెటల్స్‌ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

➡️