కోటప్పకొండ తిరునాళ్లపై తొలి సమీక్ష

Feb 13,2024 23:16

సమావేశంలో మాట్లాడుతున్న అధికారులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
రాష్ట్ర పండుగైన కోటప్పకొండలో తిరునాళ్ల వచ్చేనెల 8వ తేదీన నిర్వహించనున్న నేపథ్యంలో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎల్‌. శివశంకర్‌ ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయంలోని డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ స్పందన హాలులో మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణపై తొలిగా సమీక్షించారు. సందర్శకుల సౌకర్యార్థం ప్రతి ప్రదేశంలో గుర్తింపు బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యమ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని చెప్పారు. సందర్శకులకు అవరమైన చోట లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. పాత కోటయ్య గుడి వరకు లైటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. పబ్లిక్‌ అనౌన్స్‌ సిస్టం ఏర్పాటు చేయాలని, దానిని కమాండ్‌ కంట్రోల్‌ రూముతో అనుసంధానం చేయాలని చెప్పారు. అగ్నినిమాపక శాఖ అవసరమైన అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ఎ.శ్యాం ప్రసాద్‌ మాట్లాడుతూ విధులు కేటాయించిన అన్ని శాఖలు వారి వారి విధులను నిర్వర్తించి ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా ట్రాఫిక్‌ నియంత్రణపై దృష్టి సారించి సందర్శకులకు అసౌకర్యం కలుగకుండా చూడాలన్నారు. క్యూ లైన్లలోని వారికి మంచి నీరు, మజ్జిగ అందించాలన్నారు. అన్ని ప్రాంతాలలో మరుగు దొడ్లు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని తిరునాళ్ళలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించాలన్నారు. మెట్ల మార్గంలో అవసరమైన మరమ్మత్తులు చేపట్టాలన్నారు. సమీక్షలో జిల్లా రెవిన్యూ అధికారి కె.వినాయకం, జిల్లా ఆటవీ శాఖాధికారి రామచంద్రరావు, కోటప్పకొండ ఆలయ చైర్మన్‌ రామకృష్ణ, కొండలరావు ఆలయ కార్యనిర్వాహణ అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️