గిద్దలూరులో పోటీ సువర్ణావకాశమే: ఎమ్మెల్యే

ప్రజాశక్తి-మార్కాపురం: వచ్చే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేయాలని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని, ఇదో సువర్ణావకాశంగా భావిస్తున్నానని మార్కాపురం శాసనసభ్యులు కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. శుక్రవారం మార్కాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్కాపురం నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగుల సహకారంతో ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. మార్కాపురంలో నిర్మించే ప్రభుత్వ మెడికల్‌ కళాశాల మంజూరు విషయంలో ఎంతో కష్టపడ్డామని అన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంత ప్రజలకు ఇదో వరమని అన్నారు. ఇప్పటికే 50 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. మార్కాపురం మున్సిపాలిటీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రెండో సాగర్‌ లైన్‌ తీసుకువచ్చినట్లు తెలిపారు. పొదిలి పెద్ద చెరువు నుంచి తాగునీటి ప్రాజెక్టును తీసుకువచ్చినట్లు తెలిపారు. మార్కాపురంలో షాదీఖానా, బిసి భవన్‌, అంబేద్కర్‌ భవన్‌లు సాధించుకున్నట్లు తెలిపారు. మార్కాపురం పట్టణంలో అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ నిర్మించామన్నారు. పొదిలిలో, కొనకనమిట్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించినట్లు చెప్పారు. మార్కాపురం చెన్నకేశవస్వామి దేవాలయం అభివృద్ధికి దాతల సహకారంతో రూ.13 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. ఇందులో రూ.3 కోట్లు దేవదాయ శాఖ మంజూరు చేసిందన్నారు. పొదిలిలో 300 కుటుంబాలను బిసి ఇ కింద గుర్తించేలా చర్యలు తీసుకున్నామన్నారు. నియోజకవర్గంలో మూడు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌లు మంజూరు చేయించినట్లు తెలిపారు. తాను ఏడాదిలో 365 రోజులు ప్రజా సేవలో కొనసాగినట్లు చెప్పారు. ఈ ప్రాంత సస్యశ్యామలం కోసం నాటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ భూమిపూజతో వెలిగొండ ప్రాజెక్టు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రస్తుతం రెండు సొరంగాలను సిఎం జగన్‌ పూర్తి చేశారన్నారు. వెలిగొండ ప్రాజెక్టులో సొరంగాల నిర్మాణమే కీలకమన్నారు. మా నాన్న కెపి కొండారెడ్డిని మూడుసార్లు సమితి అధ్యక్షులుగా, నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఆదరించారన్నారు. తన మామ ఉడుముల శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యేగా ఆదరించారన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. గిద్దలూరులోనూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామన్నారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌ చిర్లంచెర్ల బాలమురళీకృష్ణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మీర్జా షంషీర్‌అలీబేగ్‌, మాజీ ఎఎంసి చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌లు షేక్‌ ఇస్మాయిల్‌, సిహెచ్‌ అంజమ్మ శ్రీనివాస్‌, ఎంపిపి పొరెడ్డి అరుణా చెంచిరెడ్డి, జడ్‌పిటిసి నారు బాపన్‌రెడ్డి, తర్లుపాడు మండల వైసిపి నాయకులు సూరెడ్డి రామసుబ్బారెడ్డి, మురారి వెంకటేశ్వర్లు, పొదిలి పట్టణ వైసిపి కన్వీనర్‌ నూర్జహాన్‌బేగం, వైసిపి నాయకులు పత్తి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.

➡️