గుంటూరు ఐజి, పల్నాడు ఎస్‌పిపై బదిలీ వేటు

Apr 2,2024 23:20

బొప్పూడి సభ వద్ద భద్రతా ఏర్పాట్ల పరిశీనలో గుంటూరు, ఐ.జి పాలరాజ్‌, పల్నాడు జిల్లా ఎస్పీ వై.రవిశంకర్‌రెడ్డి (ఫైల్‌)
ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి :
పాలనాపరంగా పలువిమర్శలను ఎదుర్కొంటున్న గుంటూరు రేంజి ఐజి పాలరాజ్‌, పల్నాడు ఎస్‌పి రవిశంకర్‌రెడ్డిని బదిలీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చిలకలూరిపేట పర్యటన సందర్భంగా గతనెల 17న జరిగిన అసాధారణ సంఘటనలకు బాధ్యులుగా పేర్కొంటూ ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. శాంతిభద్రత పరిరక్షణలోనూ పల్నాడు ఎస్‌పి పనితీరు సరిగా లేదని గతంలోనే అనేక విమర్శలు వచ్చాయి. ఇటీవల మాచర్ల వద్ద ఒక కారు దగ్ధం ఘటనపై ఎస్‌పిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ స్వయంగా పిలిచి వివరణ తీసుకున్నారు. పల్నాడులో శాంతిభద్రతల ఘటనలకు సంబంధించి కూడా నిష్పక్షపాతంగా చర్యలు చేపట్టడం లేదని ఎస్‌పి రవిశంకర్‌రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. రెండేళ్లుగా టిడిపి వారిని లక్ష్యంగా చేసుకుని వైసిపి వారు దాడులు చేస్తే వాటిని అరికట్టకపోతే వాటిని వ్యక్తిగత వివాదాలని చాలా తేలిగ్గా కొట్టిపారేడం మరింత వివాదానికి దారితీసింది. పలువురు టిడిపి కార్యకర్తలు హత్యకు గురికాగా మరికొంతమంది తీవ్రంగా గాయపడినా పోలీసులు సకాలంలో స్పందించక పోవడంపై టిడిపి చాలా కాలంగా అధికారులపై గుర్రుగా ఉంది. ఎన్‌డిఎ తో పొత్తు తరువాత నేరుగా పలు ఘటననుల ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో టిడిపి సఫలీకృతమైంది. అంతేగాక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి కూడా పోలీసుశాఖ ఉదాశీనత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిలకలూరిపేట మండలం బొప్పూడి వద్ద గతనెల 17న జరిగిన ప్రజా గళం సభలో భద్రతా వైఫల్యాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారులు నిబంధనల మేరకు వ్యవహారించకుండా పాస్‌ల జారీ ప్రక్రియను మూడు పార్టీలకు కలిపి అప్పగించడం వల్లే అనేక సమస్యలు వచ్చాయన్న వాదన నిఘా వర్గాలు గుర్తించాయి. ఎన్నికల కోడ్‌ ఉన్నా ప్రధాన మంత్రి పాల్గొనే సభలో భద్రతా, ప్రొటోకాల్‌ మొత్తం జిల్లా అధికారుల పర్యవేక్షణలోనే జరగాలని సభకు రెండు రోజులముందే ఎస్‌పిజి అధికారులు పల్నాడు జిల్లా ఉన్నతాధికారులకు సూచించినా వారు పెడచెవిన పెట్టారనే విమర్శలున్నాయి. సభా వేదికకు ముందు భాగంగా కొంత ఖాళీ స్థలం (డిజోన్‌) విడిచి పెడతారు.ఆ తరువాత గ్యాలరీల్లో అధికారికంగా జారీ చేసిన పాస్‌ హోల్డర్లు కూర్చునేలా మూడు గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. ప్రధానంగా ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రముఖులు ఒక గ్యాలరీ, ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం ఒక గ్యాలరీ, మీడియాకు ఒక గ్యాలరీని ఏర్పాటు చేస్తారు. ఈ మూడు గ్యాలరీల్లో ఉండే వారికి జిల్లా ఉన్నతాధికారులు పాస్‌ జారీ చేస్తారు. అయితే ప్రజాగళం సభలో ప్రధాని పాల్గొంటున్నా ఉన్నతాధికారులు అధికారికంగా ఎటువంటి పాస్‌లు జారీచేయలేదు. దీంతో టిడిపి, జనసేన, బిజెపి సంయుక్తంగా పాస్‌లుజారీ చేశాయి. వీటిపై పార్టీ గుర్తులు తప్ప ఎటువంటి అధికారిక ముద్ర, సంతకం లేవు. మూడుపార్టీలకు చెందిన వారి కోసం వివిఐపి, విఐపి, మీడియా పేరుతో పాస్‌లు ఆయా పార్టీలు తమ అనుచరులకు, మీడియాకు ఇష్టానుసారంగా పంపిణీ చేశాయి. దీంతో సాధారణ కార్యకర్తలు సైతం ప్రధాని సభా వేదికకు అతి దగ్గరలో డి.జోన్‌కు సమీపంలో ఆశీనులయ్యారు. ఈ గ్యాలరీల్లోకి పరిమితి లేకుండా ఎక్కువ మందిని అనుమతించడం వల్ల తీవ్ర తొక్కిసలాట జరిగింది. గ్యాలరీల్లో కూర్చునే అవకాశం లేక కొంత యువకులు మైకులు, విద్యుత్‌ వైర్లు కట్టిన స్తంభాలు ఎక్కి కూర్చున్నారు. కొంతమంది ఆకతాయిలు తమ ముందు ఉన్న కార్యకర్తలను పిలిచేందుకు వాటర్‌ బాటిల్స్‌ను విసరడాన్ని కేంద్ర భద్రతా విభాగం తీవ్రంగా పరిగణించింది. వాటర్‌ బాటిల్స్‌ విసరడం వల్ల వేదికపైన ఉన్న ప్రధాన మంత్రిపైకి విసురుతున్నారనే భావనతో ఎస్‌పిజి అధికారులు ఆందోళనకు గురయ్యారు. సభలో పలు గ్యాలరీల్లోకి కార్యకర్తలు, సాధారణ ప్రజలు చొచ్చుకొని వస్తున్నా నియంత్రించడంలో పోలీసు అధికారులు పట్టిపట్టన్నట్టు వ్వవహరించారు. దీంతో చాలామంది ఊపిరాడక ఇబ్బందిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులు, దిగువ స్థాయి అధికారులు,వాలంటీర్లు నిర్వహణా లోపం వల్ల పలు గ్యాలరీల్లోకి సాధారణ ప్రజలు చొచ్చుకుని వచ్చారు. ప్రధాని సభా వేదికకు ముందు సాధారణ ప్రజలు,అనధికారిక పాస్‌ హోల్డర్లును కూర్చొడానికి అనుమతించడం భద్రతా వైఫల్యానికి కారణంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల ప్రచార సభ అయినా కనీస భద్రత ప్రమాణాలను పాటించడంలో అధికారులు వైఫల్యం చెందారని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు నివేదికలు వెళ్లాయి. సభ జరుగుతున్న సమయంలో బాటిళ్లు గ్యాలరీల్లోకి విసరడం, లైట్‌ టవర్స్‌ ఎక్కేయడం, మైక్‌సెట్‌ పైకి జనం దూసుకురావడం, ప్రధాని ఉన్న సమయంలోనే జనం వేదికకు సమీపంలోకి రావడం వంటి ఘటనను కేంద్ర ప్రభుత్వం కూడా తీవ్ర తప్పిదంగా భావించింది. ప్రధాన మంత్రి సభలో ఉన్నారని తెలిసి కూడా పోలీసు అధికారులు తగిన రీతిలో భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందారనే విమర్శలను గుంటూరు రేంజి ఐ.జి. పాలరాజ్‌, ఎస్‌పి రవిశంకర్‌రెడ్డి మూటగట్టుకున్నారు.

➡️