గొంప కృష్ణ గ్రూపుతో భరత్‌ భేటీ

Apr 2,2024 20:52

ప్రజాశక్తి – శృంగవరపుకోట: ఎస్‌కోట నియోజకవర్గంలోని గొంప కృష్ణ గ్రూపుతో టిడిపి ఎంపి అభ్యర్థి శ్రీభరత్‌ మంగళవారం భేటీ అయ్యారు. ఐదు మండలాల టిడిపి అధ్యక్షులుగా రాజీనామ చేసిన గొంప వెంకటరావు, రాయవరపు చంద్రశేఖర్‌, లఘుడు రవి, గొరపల్లి రాము, ఎస్‌కోట నియోజకవర్గం మహిళా అధ్యక్షులు గుమ్మడి భారతీలతో ఆయన ఎస్‌కోటలోని గొంప కృష్ణ నివాసంలో సమావేశమయ్యారు. సుమారు నాలుగు గంటలు పాటు చర్చించారు. ఈ చర్చల్లో కచ్చితంగా గొంప కృష్ణకు టిక్కెట్టు ఇస్తేనే తామంతా టిడిపికి పనిచేస్తామని లేకపోతే కృష్ణను ఇండిపెండెంట్‌గా పోటి చేయించి విజయం సాధిస్తామని చెప్పారు. అవసరమైతే ఎంపీగా తమకు మాత్రం ఓటేస్తాం కానీ కోళ్ల లలితకుమారికి మాత్రం వేయమని ఖరాఖండీగా చెప్పారు. అనంతరం భరత్‌ మాట్లాడుతూ తప్పు జరగడం వాస్తవమేనని నియోజకవర్గాన్ని గొంప కృష్ణ పార్టీ పరంగా బాగా అభివృద్ధి చేశారని ఆయనకు తాను కూడా రుణపడి ఉంటానని అన్నారు. కృష్ణకు టికెట్‌ ఇవ్వకపోవడం వల్ల మీరు పడుతున్న అవమానాలను అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్లి రెండు రోజుల్లో సమస్య పరిష్కారిస్తానని హామీ ఇచ్చారు.

➡️