చదువు కోసం.. నిత్య బాటసారులు..

Apr 2,2024 23:16

మండుటెండలో నడిచివెళ్తున్న విద్యార్థినులు
ప్రజాశక్తి – మాచర్ల :
వసతి గృహంలో ఉండి మంచి విద్యను అందుకుందామని, మాచర్ల పట్టణానికి చుట్టుపక్కల పలు గ్రామాలు నుండి చదువుకొరకు వచ్చిన విద్యార్థినులు అష్టకష్టాలు పడుతున్నారు. పట్టణంలోని మండాది రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద సోషల్‌ వెల్ఫేర్‌ హాస్టల్లో ఉండి చదువుకోవటానికి వచ్చిన విద్యార్థినులు జిల్లా పరిషత్‌ బాలికల పాఠశాలకు రావాలంటే రెండు కిలో మీటర్లు నడవాల్సి వస్తుంది. రానూపోనూ రోజూ వారు నాలుగు కిలోమీటర్లు చదవుకోసం నడవాల్సిందే. వీరంతా పేద వర్గాలకు చెందిన పిల్లలు. అక్కడ నుంచి స్కూలుకు ఆటోలు రావాలంటే రానూబోనూ రోజుకు రూ.80 ఖర్చు చేయాలి. అంతమొత్తం భరాయించలేక పిల్లలు నడకమార్గాన్నే అనుసరిస్తూ ఇబ్బందులు పడుతున్నారు. అదీగాక వానలకు తడుస్తూ, ఎండలకు ఎండుతూ, మోపెడు బరువున్న పుస్తకాల సంచులను భుజాలకు తగిలించుకొని బాధలు పడుతున్నారు. కొద్దిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. ఒక్క పూట బడులు కావటంతో ఉదయం పూట ఎండ బారిన పడకుండా వెళ్లినా మధ్యాహ్నం మండుటెండలో రెండు కిలోమీటర్లు నడిచి వసతి గృహానికి చేరుకోవాల్సి వస్తోంది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకుపోయినా సమస్య పరిష్కారం కావటం లేదు. ఈ ఎండలు భారినుండైనా వారిని తప్పించేందుకు అధికారులు ఏదోఒక పరిష్కారాన్ని చూపాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

➡️