చదువే సమాజాన్ని మార్చే ఆయుధం

Feb 10,2024 21:42

ప్రజాశక్తి – పార్వతీపురం: చదువొక్కటే సమాజాన్ని మార్చగలదని, ఆ చదువును ప్రతి విద్యార్థి ప్రేమించి ఆశ్వాదించాలని ప్రముఖ కవి, రచయిత గంటేడ గౌరునాయుడు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ప్రజ్ఞా వికాసం పరీక్ష శనివారం పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. అందులో భాగంగా స్థానిక ఆర్‌కె, జనహిత కళాశాలలో పట్టణంలో గల అన్ని పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. ప్రజ్ఞా వికాసం పరీక్ష పత్రాలను గౌరునాయుడు, సీనియర్‌ న్యాయవాది టి.జోగారావు, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి భాస్కరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా గౌరునాయుడు మాట్లాడుతూ నేటి విద్యార్థులు పరీక్షలంటేనే భయాందోళనకు గురవుతూ, చదువును మధ్యలోనే నిలిపివేసే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. ఇటువంటి నేపథ్యంలో విద్యార్థులకు కావాల్సింది నైపుణ్యత, శిక్షణల అని అన్నారు. టి.జోగారావు మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు రాబోయే పబ్లిక్‌ పరీక్షలకు ఈ ప్రజ్ఞా వికాస పరీక్ష దోహదపడుతుందన్నారు. ప్రపంచీకరణ విధానాలకు లోబడకుండా భవిష్యత్తు లక్ష్యసాధనకై కృషి చేయాలని, విద్యకు దూరంగా ఉన్న విద్యార్థులకు విద్యను అందించేలా తోటి విద్యార్థుల ఆలోచన మెరుగుపడాలని కోరారు. భాస్కరరావు మాట్లాడుతూ పరీక్షల్లో ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ఏక దృష్టితో మంచి ఉత్తీర్ణత సాధించాలని, ఉన్నత స్థాయికి ఎదగాలని, నేటి మారుతున్న విద్యారంగంతో విద్యార్థుల దృష్టిని మళ్లించే ప్రయ త్నాలు పాలక ప్రభుత్వాలు చేపడుతున్నాయని అన్నారు. అటువంటి భ్రమలకు లోబడకుండా, శాస్త్రీయ విద్యతో మెలగాలని అన్నారు. కె.రాజు మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థుల, విద్యారంగ సమస్యలతో పాటు విద్యార్థుల నైపుణ్యతను పెంచి, భవిష్యత్తులో ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా వికాసం పరీక్షలు నిర్వహిస్తుందని అన్నారు. స్వాతంత్ర ఉద్యమ నాయకుల జీవిత చరిత్రలను ఆదర్శంగా చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హెచ్‌.సింహాచలం, శివ, సురేష్‌, అంజలి, కృష్ణ, శారద, శ్రావణి, కరిస్మా, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.సాలూరు : విద్యార్ధులు అంకితభావంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చునని టౌన్‌ సిఐ జిడి బాబు చెప్పారు. యుటిఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న పదోతరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాస పరీక్ష పత్రాలను ఆయన విడుదల చేశారు. పట్టణంలోని సాయి సూర్య స్కూల్‌, భాష్యం స్కూల్‌లో నిర్వహించిన పరీక్షలకు రెండు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిఐ జిడి బాబు మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సిధ్ధమయ్యే రీతిలో విద్యార్ధులు హైస్కూల్‌ స్థాయి నుంచి సన్నద్ధం కావాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పండు మాట్లాడుతూ పదోతరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షల పట్ల భయాందోళనలు పోగొట్టడానికే గత కొంతకాలంగా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు టి.అఖిల్‌, సభ్యులు పాల్గొన్నారు.

➡️