చిన్నాన్న కోరిక మేరకే ఎంపీగా పోటీ

ప్రజాశక్తి – వేంపల్లె/కడపమాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డి చిన్నాన ఆకరి కోరిక నన్ను ఎంపీగా చూడాలని ఉండేదని, ఆయన కోరిక మేరకే కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. మంగళవారం ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో వైఎస్‌ఆర్‌ సమాధికి నివాళులర్పించారు. అనంతరం షర్మిల విలేకరులతో మాట్లాడుతూ చిన్నాన్న తనను ఎంపీగా పోటీ చేయమని ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదని తెలిపారు. ఇవాళ అర్థమైందన్నారు. నా చెల్లి సునీత న్యాయం కోసం గడప గడపకూ తిరుగుతోందని చెప్పారు. అయినా ఆమెకు న్యాయం జరగలేదన్నారు. న్యాయం కోసం ఎక్కని మెట్టు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను హత్యా రాజకీయాలకు విరుద్ధమని చెప్పారు. కడప కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నట్లు చెప్పారు. వైఎస్‌ఆర్‌ బిడ్డగా తాను నిలబడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం నాకు సులువైంది కాదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్‌ నా అనుకున్న వాళ్ళను అందరినీ నాశనం చేశాడని తెలిపారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడన్నారు. కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్‌ ఇచ్చాడని తెలిపారు. అవినాష్‌రెడ్డిని వెనకేసుకు వస్తున్నాడని తెలిపారు. మళ్ళీ అవి నాష్‌రెడ్డికి కడప సీటు ఇవ్వడం తట్టుకోలేక పోయా నన్నారు. ఒక హంతకుడు పార్లమెంట్‌లోకి వెళ ్లకూడదనే పోటీకి సిద్దమయ్యానన్నారు. రాష్ట్రం అభి వృద్ది చెందాలంటే కాంగ్రెస్‌ అధికారంలో రావాలని కోరారు. విభజన హామీలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం రావాలని చెప్పారు. వైఎస్‌ఆర్‌కు నివాళులర్పించిన షర్మిలఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలోని తన తండ్రి వైఎస్‌ఆర్‌ సమాధి వద్ద పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం హైదరాబాద్‌ నుండి కడప ఎయిర్‌ పోర్ట్‌కు ప్రత్యేక విమానంలో వచ్చిన షర్మిలకు కాంగ్రెస్‌ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం షర్మిల కడప ఎయిర్‌ పోర్ట్‌ నుండి రోడ్డు మార్గం ద్వారా 3.30 గంటలకు ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. అనంతరం వైఎస్‌ఆర్‌ సమాధి వద్దకు తన తల్లి విజయమ్మ, కుమార్తె అంజలితో కలిసి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వైఎస్‌ఆర్‌ సమాధికి నివాళులర్పించి సమీ పంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహనికి పూల మాలలు వేశారు. కాంగ్రెసు పార్టీ తరఫున కడప పార్లమెంటు బరిలో దిగుతున్న షర్మిలను తల్లి విజ యమ్మ విజయం సాధించాలని ప్రార్థన చేసి ఆశ్వీరాదం చేశారు. వైఎస్‌ ఆర్‌కు నివాళులర్పించిన వారిలో మాజీ పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్ర రాజు, రఘు వీరారెడ్డి, పిసిసి మీడియా చైర్మన్‌ తుల సిరెడ్డి, జెడి శీలం, జిల్లా అధ్యక్షులు శ్రీరాములు, నంది క్కొటురు ఎమ్మెల్యే ఆర్థర్‌, నెల్లూరు డిసిసి అధ్యక్షుడు దేవ నాథ్‌రెడ్డి, పులివెందుల అసెంబ్లీ ఇన్‌ఛార్జి వేలూరు శ్రీనివాసులురెడ్డి, బద్వేలు అభ్యర్థి విజయజ్యోతితో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు. ఇఫ్తార్‌ విందులో.. కడప నగరంలోని అమీన్‌ ఫంక్షన్‌ ఫ్యాలెస్‌లో మంగళవారం సాయంత్రం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సలావుద్దీన్‌, నజీర్‌ అహ్మద్‌, దాదావల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందుకు షర్మిల హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిమ్‌ నాయకులతో కలిసి ప్రార్థనలు చేశారు. ప్రజలందరికీ రంజాన్‌ మాస శుభాకాంక్షలు తెలియజేశారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చేది కాంగ్రెస్‌ పార్టీనే అని అన్నారు. మతతత్వ పార్టీ అయిన బిజెపిని ఓడిస్తేనే ముస్లిం మైనార్టీలకు, క్రిస్టియన్లకు అన్ని వర్గాల వారికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ ఇఫ్తార్‌ విందుకు కార్యక్రమంలో పిసిసి మీడియా చైర్మన్‌ తులసి రెడ్డి, జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు, సిపిఎం జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్‌, సిపిఐ నాయకులు జి. చంద్ర, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, ముస్లిం నాయకులు పాల్గొన్నారు. అనంతరం కడన నగరంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో ఉన్న జమాయతే పులిమా హింద్‌ సంస్థ ప్రతినిధులను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. సంస్థ ప్రతినిధులు ఆమెను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు.

➡️