చీపురుపల్లి టిక్కెట్టు పై పునరాలోచించాలి

Mar 31,2024 21:01

ప్రజాశక్తి- చీపురుపల్లి : చీపురుపల్లి టిడిపి టిక్కెట్‌పై అదిష్టానం పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని టిడిపి నాయకులు కిమిడి నాగార్జున కోరారు. తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో నాగార్జున మాట్లాడారు. టిడిపి ఆఖరి లిస్ట్‌ ఇచ్చిన తర్వాత చీపురుపల్లిలో నిరాశ నిస్పృహలు భగ్గుమన్నాయన్నారు. కొన్ని ప్రతిస్పందనలు తన గుండెకి హత్తుకున్నాయని, నాగార్జున అనే వ్యక్తి చీపురుపల్లి నియోజకవర్గంలోనే కాకుండా ఏడు నియోజకవర్గాలతో పాటు రెండు జిల్లాల్లోనూ ఎంతోమంది గుండెల్లో ఉన్నాడని ఈ సంఘటన తరువాత తనకు తెలిసిందన్నారు. ఎంతోమంది ఫోన్‌ చేసి మీరు చాలా కష్టపడ్డారు, మీకు మంచి భవిష్యత్తు ఉందని తనతో అంటున్నట్లు చెప్పారు. చాలా ప్రాంతాల నుంచి ఫోన్లు వస్తున్నాయని అందరూ బాధపడుతున్నారని ఇంత మంది గుండెల్లో చోట సంపాధించడం ఆనందంగా ఉందని చెప్పారు. తనకు నారా లోకేష్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌ వచ్చిందని అక్కడకు రమ్మన్నారని నాయకులు, కార్యకర్తలతో చర్చించి లోకేష్‌ దగ్గరికి వెళ్లి ఇక్కడున్న వాస్తవ పరిస్థితులను వివరిస్తానని చెప్పారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.నేడు కళాను కలవనున్న గరివిడి నాయకులుచీపురుపల్లి టిడిపి టిక్కెట్టు కిమిడి కళావెంకటరావుకి కేటాయించడంతో భగ్గుమన్న టిడిపి కేడర్‌ గత మూడు రోజులుగా చీపురుపల్లిలో నాగార్జున వర్గం ఆందోళన చేస్తుంటే, గరివిడికి చెందిన మరో వర్గం కళావెంకటరావుని కలిసేందుకు సోమవారం రాజాం వెల్లుతున్నట్లు ఆ పార్టీ నాయకులు రెడ్డి గోవిందనాయుడు తెలిపారు. పార్టీ ఆదేశాలే ముఖ్యమని ఆయన అన్నారు. పార్టీ ఎవరికి టిక్కెట్టు ఇచ్చినా తాము కష్టపడి అభ్యర్ధిని గెలిపించుకునేందుకు కృషి చేస్తామని చెప్పారు. గరివిడి మండలంతో పాటు గరివిడి పట్టణం నుండి కళా వెంకటరావుని కలిసేందుకు పది కార్లలో నాయకులు వెలుతున్నట్లు గోవింద నాయడు తెలిపారు.

➡️