జగనన్నకు చెబుదాంకు 175 వినతులు

Feb 26,2024 21:42

ప్రజాశక్తి-విజయనగరం కోట :  జగనన్నకు చెబుదాంలో వివిధ సమస్యలపై అందిన వినతుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటిని సకాలంలో పరిష్కరించాలని డిఆర్‌ఒ అనిత అధికారులను ఆదేశించారు. ఆయా ప్రభుత్వ శాఖలు తమకు సంబంధించి ఆన్‌లైన్‌లో పంపిన వినతులను పరిశీలించి వాటిపై స్పందించాలన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో డిఆర్‌ఒ ఎస్‌.డి.అనిత , సహాయ కలెక్టర్‌ త్రివినాగ్‌ , కెఆర్‌ఆర్‌సి డిప్యూటీ కలెక్టర్‌ సుమబాల, మురళీ కృష్ణ, ఆర్‌డిఒ సూర్యకళ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై 175 వినతులు అందాయి. హుదూద్‌ ఇళ్లు అప్పగించండి హుదూద్‌ ఇళ్లను లబ్ధిదారులకు నేటికీ అప్పగించకపోవడం వల్ల అన్యాక్రాంతం అవుతున్నాయని టిడిపి నాయకులు స్పందనలో ఫిర్యాదు చేశారు. వెంటనే లబ్దిదారులకు గృహాలను అప్పగించాలని కోరారు. కొండకారకం, గుండాలపేటలో జగనన్న కాలనీల కోసం రైతుల నుంచి భూసేకరణ చేసి మూడేళ్లు దాటినా కొంతమందికి ఇంకా పరిహారం అందించలేదని, వెంటనే వారికి పరిహారం అందించాలని కోరారు. వినతినిచ్చిన వారిలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు బొద్దల నర్సింగరావు, కార్యదర్శి గంటా పోలినాయుడు ,కనకల మురళీమోహన్‌ , కొండ్రు శ్రీనివాస్‌, పైడిరాజు నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.రైతులకు న్యాయం చేయాలని ధర్నా విజయనగరం టౌన్‌ : ఎస్‌.కోట మండలంలోని ముషిడిపల్లి, పెదఖండేపల్లి, మూలబొడ్డవర, కిల్తంపాలెం గ్రామ పంచాయతీల పరిధిలో జిందాల్‌ కంపెనీకి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ వద్ద బాధితులు ధర్నా చేశారు. ధర్నాను ఉద్దేశించి భూ నిర్వాసితులు రైతు లు కర్రీ సత్యన్నారాయణ, పోతన్న, శ్రీరాములు, కనకం మాట్లాడుతూ 2008లో పలు గ్రామాల రైతులు జిందాల్‌ అల్యూమినా రిఫైనరీ కంపెనీ నిర్మాణం నిమిత్తం భూములిచ్చారని, కానీ నేటికీ ఆర్‌అండ్‌అర్‌ ప్యాకేజీ, ఉద్యోగాలు ఇవ్వకుండా కంపెనీ అన్యాయం చేసిందని అన్నారు. సుమారు 16ఏళ్లయినా కంపెనీ నిర్మాణం చేపట్టలేదని, జిందాల్‌ కంపెనీ నిర్మాణానికి భూములిచ్చిన నిర్వాసిత రైతులకు నగదుతో పాటుగా, షేర్ల రూపేణా ఇవ్వలేదన్నారు. తక్షణమే కలెక్టర్‌ కలుగుచేసుకొని భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు.

➡️