జిసిసి కార్మికులకు పూర్తి పని దినాలు కల్పించాలి

Feb 12,2024 20:52

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : విజయనగరం జిసిసి సోప్‌ యూనిట్‌లో కార్మికులకు పూర్తి పనిదినాలు కల్పించాలని జిసిసి సోపు యూనిట్‌ యూనియన్‌ (సిఐటియు) గౌరవ అధ్యక్షులు ఎ.జగన్‌ మోహన్‌రావు, అధ్యక్ష, కార్యదర్శులు సంతు, సుశీల కోరారు. ఈ మేరకు సోమవారం జిసిసి చైర్‌పర్సన్‌ శోభా స్వాతిరాణి , ఎమ్‌డి జి.సురేష్‌ కుమార్‌ని కలిసి సోమవారం వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులకు 15 రోజులకు మించి పని కల్పించడం లేదన్నారు. ఇఎస్‌ఐ అర్హత కూడా కోల్పోతామని చెప్పారు. వచ్చే రూ.4 వేలు వేతనంతో కుటుంబాన్ని ఏ విధంగా పోషించుకోవాలని, అది కూడా నెలాఖరికి ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఏడాది కాలంగా పని సక్రమంగా ఉండడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. జీతం చెల్లించాలని అడిగితే మూసేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. దీనిపై చైర్‌పర్సన్‌ స్వాతీరాణి స్పందిస్తూ పనిదినాల పెంపునకు, జీతాల సకాలంలో చెల్లించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. వారం రోజుల్లో సోపు యూనిట్‌ను సందర్శిస్తానని, స్థానిక సమస్యలు పరిష్కరిస్తానని చెప్పారు. ప్రభుత్వ వసతిగృహాలకు జిసిసి సబ్బుల పంపిణీకి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఆర్డర్‌ వస్తే పూర్తిస్థాయిలో పని కల్పిస్తామన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో శేషు, భారతి, రమణమ్మ, సూర్యనారాయణ , లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

➡️