టిడిపితో యువతకు బంగారు భవిష్యత్తు

Feb 13,2024 21:23

ప్రజాశక్తి-విజయనగరం కోట : చంద్ర బాబు అధికారం లోకి వస్తే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందని టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పి.అదితి గజపతి అన్నారు. యువతకు ఉద్యోగాలు లేకపోతే వారి భవిష్యత్తు నాశనమై డిప్రెషన్‌ లోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందారు. మంగళవారం అశోక్‌ బంగ్లా టిడిపి కార్యాలయంలో ‘ఫస్ట్‌ఓటు ఫర్‌ సిబిఎన్‌’ పేరిట నిరుద్యోగ యువతతో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముందుగా యువత మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఐటి సెక్టార్‌ ఎక్కువగా తీసుకువచ్చి వేల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించారని తెలిపారు. మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి నుండి మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు యువత ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు. జగన్మోహన్‌ రెడ్డి వచ్చాక సచివాలయ ఉద్యోగాలు తప్ప మరి ఏ ఇతర ఉద్యోగాలు తీయలేదన్నారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే యువత భవిష్యత్తు ఉద్యోగాల వైపు వెళుతుందని అన్నారు. అదితి గజపతిరాజు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం నుండి పరిశ్రమలు వెళ్లిపోయాయని, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు సైతం లేవని తెలిపారు. ఏటా జాబ్‌కేలండర్‌ ప్రకటిస్తామని చెప్పి యువతకు వెన్నుపోటు పొడిచారన్నారు. చంద్రబాబు సిఎం అయితే రాష్ట్ర రూపు రేఖలు మారుస్తారని, యువతకు బంగారు భవిష్యత్తును అందిస్తారని అన్నారు.అశోక్‌ ను కలిసిన రాంప్రసాద్‌ రాష్ట్ర బ్రాహ్మణా సాధికార కమిటీ కన్వీనర్‌ బుచ్చి రాంప్రసాద్‌ మంగళవారం నాడు పార్టీ కార్యాలయం అశోక్‌ బంగ్లాలో పొలిట్‌ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్‌ గజపతి రాజును, నియోజకవర్గ ఇంచార్జ్‌ పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో పాటు పార్లమెంట్‌ బ్రాహ్మణ సాధికార కమిటీ కన్వీనర్‌ రాకేష్‌ శర్మ, ఇతర బ్రాహ్మణ కమిటీ నాయకులు పాల్గొన్నారు.సంఘీభావం తెలిపిన అదితిఉత్తరాంధ్ర తెలగాలను బిసిలో చేర్చాలని పాదయాత్ర చేస్తున్న తెలగ సంఘం నాయకులు పివిఆర్‌ ను మంగళవారం అదితి గజపతి కలిసి సంఘీభావం తెలిపారు.

➡️