టిడిపి కోసం ప్రాణాలు తెగించి పోరాడా : సతీష్‌రెడ్డి

ప్రజాశక్తి-వేంపల్లె తెలుగుదేశం పార్టీ కోసం ప్రాణాలు తెగించి పోరాడినా చంద్రబాబు నన్ను నమ్మలేదని శాసనమండలి డిప్యూటీ మాజీ చైర్మన్‌ సతీష్‌ కుమార్‌రెడ్డి అన్నారు. బుధవారం స్థానిక ఉర్దూ ఘర్‌ షాదీఖానాలో సతీష్‌రెడ్డి ఆత్మీయ సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను ఎవరితో పోరాటం చేశానో అలాంటి సిఎం జగన్‌నే స్నేహ హస్తం అందించారన్నారు. ఆయన ఆహ్వానం మేరకు త్వరలో వైసిపిలో చేరుతున్నాని చెప్పారు. నాలుగేళ్ళుగా రాజకీయాలకు దూరంగా ఉండడంతో మళ్ళీ రాజకీయాలలోకి రావాలని నా వర్గం కోరిందని చెప్పారు. టిడిపి నా కుటుంబం అనుకున్నా కాని నాలుగేళ్ళ రాజకీయాలకు దూరంగా ఉన్నా నన్ను పట్టించుకోలేదన్నారు. నేను నమ్మిన నాయకుడు, ఆయన కుమారుడు నన్ను కొందరితో లాలూచి పడ్డానని అవమా నించారని చెప్పారు. టిడిపి కోసం ప్రాణమైనా ఇవ్వడానికి సిద్దపడ్డ నన్ను వైఎస్‌ కుటుంబంతో లాలూచి పడ్డానని వారు చెప్పారన్నారు. ఇంత అవమానించిన తర్వాత టిడిపిలో ఆపార్టీలో ఉండటం సరికాదనే ఆరోజు రాజీమామా చేసినట్లు చెప్పారు. నాకోసం నాతో టిడిపిలో కలిసి తిరిగిన పెద్ద నేతలు చంద్రబాబును అడిగినా ఆయన పట్టించుకోలేదని తెలిపారు. నాలుగురోజుల నుంచి పరిస్థితులు మారినట్లు చెప్పారు. సిఎం జగన్‌ వైసిపి నేతలను నావద్దకు పంపించి నన్ను ఆహ్వానించడం ఎంతో ఆనందం అనిపించిందన్నారు. సిఎం తన వారిని పంపించిన తర్వాత టిడిపి వారు వచ్చారని తెలిపారు. నాలుగేళ్ళుగా నేను టిడిపి వారికి కనబడలేదని చెప్పారు. ప్రతి గ్రామంలో మన అందరి గౌరవాలు నిలబడే విధంగా వైసిపిలో చేరడానికి ముందుకు వెళ్లాలని చెప్పారు. వేంపల్లెలో సిఎం జగన్‌ సహకారంతో సుందరీకరణ పనులు చేస్తున్నట్లు చెప్పారు. వైసిపిలో చేరిన తర్వాత సిఎం జగన్‌ ఆదేశిస్తే జిల్లాలో టిడిపి అసంతప్తితో ఉన్న వారిని పార్టీలో చేర్చేందుకు కషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో సతీష్‌రెడ్డి కుమారులు రోహన్‌ నాగిరెడ్డి, తుషార్‌ నాగిరెడ్డి, మాజీ సర్పంచ్‌ విష్ణువర్దన్‌రెడ్డి పాల్గొన్నారు.

➡️