టీకాలతో వ్యాధులు దూరం

Feb 10,2024 22:07

ప్రజాశక్తి – సీతానగరం: పిల్లలకు పలు వ్యాధుల నుంచి టీకాలు పూర్తి రక్షణ కల్పిస్తాయని డిఎంఒ డాక్టర్‌ టి.జగన్‌మోహనరావు అన్నారు. మండలంలోని నీలకంఠపురం, గుచ్చిమి గ్రామాల్లో టీకా కార్యక్రమాన్ని శనివారం తనిఖీ చేశారు. పిల్లలకు వేసిన టీకాల వివరాలను రికార్డులోనూ, ఎంసిపి కార్డుల్లో పరిశీలించి సకాలంలో వేయడం జరుగుతున్నదీ, లేనిదీ తేదీలను, పిల్లల వయస్సును పరిశీలించారు. పిల్లలకు వేస్తున్న ప్రతి టీకా ఆవశ్యకతను తల్లిదండ్రులకు వివరించాలని, టీకా వివరాలు అదే రోజు ఆన్లైన్‌ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లల ఆరోగ్య విషయమై అడిగి తెలుసుకున్నారు. జ్వర లక్షణాలుంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. పిల్లలకు పలు ప్రాణాంతకమైన వ్యాధులు రాకుండా టీకాలు తప్పనిసరి అని ముఖ్యంగా పోలియో, న్యుమోనియా, అతిసారం, క్షయ, హెపటైటిస్‌, తట్టు, రూబెల్లా, కంఠసర్పి, కోరింతదగ్గు, ధనుర్వాతం తదితర వ్యాధుల నుంచి రక్షణకు టీకాలు సకాలంలో వేయాలన్నారు. అత్యవసర మందులు గ్రామాల్లో అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది జయలక్ష్మి, రవణమ్మ, సంధ్యారాణి, ఆశా కార్యకర్తలు ఉన్నారు.

➡️