డబ్ల్యుటిఒ ఒప్పందాలను వ్యతిరేకించాలి

నక్కపల్లిలో ఆందోళన చేస్తున్న రైతు సంఘం నేతలు, రైతులు

ప్రజాశక్తి-అనకాపల్లి

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ఒప్పందాలకు వ్యతిరేకంగా, ఢిల్లీ సరిహద్దు రైతు ఉద్యమానికి మద్దతు సంయుక్త కిసాన్‌ మోర్చా, ఏపి రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు సోమవారం అనకాపల్లి నెహ్రూ చౌక్‌ జంక్షన్‌ అంబేద్కర్‌ విగ్రహం దగ్గర రైతు, కార్మిక సంఘాల ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సంయుక్త కిసాన్‌ మోర్చా జిల్లా కన్వీనర్‌ కర్రి అప్పారావు, రైతు, కూలి సంఘాల నాయకులు కోన మోహన్‌ రావు, గండి నాయనబాబు, శంకర్రావు, సదాశివరావు మాట్లాడారు. గత మూడు దశాబ్దాలుగా డబ్ల్యూటీవోలో వెనుకబడిన దేశాలపై సంపన్న దేశాలు అమలు చేస్తున్న ఒప్పందాల వలన భారతదేశంలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో సంక్షోభం నెలకొందన్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను, విద్యుత్‌ సవరణ చట్టం, లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చినట్లు చెప్పారు. ప్రస్తుతం అబుదాబిలో జరుగుతున్న డబ్ల్యూటీవో 13వ మంత్రి వర్గ సమావేశాల్లో… భారత దేశ ఆహార భద్రత చట్టాన్ని నిర్వీర్యం చేసే, ఎంఎస్‌పిను రద్దు చేసే, మార్కెట్‌ యార్డులను కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు అప్పజెప్పే ప్రపంచ వాణిజ్య సంస్థ ఆదేశాలను భారత ప్రభుత్వం తిరస్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పియస్‌.అజరు కుమార్‌, కనిశెట్టి సురేష్‌ బాబు, అయితిరెడ్డి అప్పలనాయుడు, గడి సూర్యారావు, పైలా రమేష్‌, బి.జగదీష్‌ పాల్గొన్నారు.నక్కపల్లి : క్విట్‌ డబ్ల్యుటిఓ దినోత్సవం సందర్భంగా సోమవారం బబీతీ రైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రైతులు నిరసన చేపట్టారు. వ్యవసాయాన్ని డబ్ల్యుటిఓ నుండి దూరంగా ఉంచాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం అప్పలరాజు డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో పిఎన్‌ఎం జిల్లా అధ్యక్షులు ఎం.రాజేష్‌, రైతు సంఘం నాయకులు జి.వెంకటరమణ, రైతులు పాల్గొన్నారు.

➡️