డిఎస్‌సిలో అప్రెంటీస్‌ విధానాన్ని రద్దు చేయాలి

Feb 10,2024 21:16

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  డిఎస్‌సిలో అప్రెంటేస్‌ విధానం రద్దు చేయాలని, ఉపాధ్యాయ పోస్టుల సంఖ్యను పెంచాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు డిమాండ్‌ చేశారు. శనివారం యుటిఎఫ్‌ జిల్లా కార్యవర్గ సమావేశం యూత్‌హాస్టల్‌లో జిల్లా అధ్యక్షులు జె ఆర్‌ సి పట్నాయక్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మోహనరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసిన డిఎస్‌సి నోటిఫికేషన్‌లో జీవో నెంబర్‌ 56 ద్వారా రెండేళ్ల అప్రెంటిస్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెట్టడం అన్యాయమన్నారు. మున్సిపల్‌ ఉపాధ్యాయులకు జీవో నెంబర్‌ 7,8,9,10 ద్వారా సర్వీస్‌ రూల్స్‌ విడుదల చేశారని, వీటి ఆధారంగా ప్రభుత్వం ప్రమోషన్లు, బదిలీలను, పిఎఫ్‌ తదితరాలను ఈసర్వీస్‌రూల్స్‌ ప్రాతిపదిక చెయ్యాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఆర్‌కె ఈశ్వరరావు మాట్లాడుతూ ఒపిఎస్‌ అమలు చేయాలని, ఓట్‌ ఫర్‌ ఒపిస్‌ నినాదంతో అన్ని పార్టీల నాయకత్వానికి పోస్టు కార్డు క్యాంపెయిన్‌ చేస్తున్నామని, మండల, నియోజక వర్గం, జిల్లా స్థాయిలో పార్టీ అధ్యక్షులకు వినతి పత్రాలు అందజేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో సిపిఎస్‌ రద్దుచేసి, పాత పెన్షన్‌ పునరుద్ధరణను అజెండాగాపెట్టాలన్నారు. సమావేశంలో యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి, జిల్లా గౌరవాధ్యక్షులు మీసాల. అప్పలనాయుడు, సహాధ్యక్షులు వి.ప్రసన్న కుమార్‌, జి. పార్వతి, కోశాధికారి సిహెచ్‌ భాస్కరరావు, అకడమిక్‌ అధ్యయన బృందం సభ్యులు డి. రాము, రాష్ట్ర కౌన్సిలర్లు ఎ.సత్య శ్రీనివాస్‌, సి హెచ్‌ వెంకటరావు, నాయకులు కె.శ్రీనివాసరావు, కె.అప్పా రావు, జి.పద్మావతి జిల్లా కార్యదర్శులు కె.ప్రసాదరావు, పి త్రినాథ్‌,పక్కి వాసు, పి.వాసుదేవరావు, అర్‌ఎవి సూర్యారావు, సిహెచ్‌ తిరుపతి నాయుడు, జి.రాజారావు, సూరి శ్రీనివాసరావు,అల్లు శంకరరావు, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

➡️