తాగునీటిపై ఆందోళన వద్దు

Feb 11,2024 00:43

ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు నగర ప్రజలు తాగునీటి సరఫరాపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జిఎంసి శుద్ధమైన తాగునీటిని అందించడంలో నిబంధనల మేరకు చర్యలన్నీ తీసుకుంటుందని నగర మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు, కమిషనర్‌ కీర్తి చేకూరి అన్నారు. శారదా కాలనీ, శ్రీనగర్‌ ప్రాంతాల్లో ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని తెలిసిన వెంటనే నగర మేయర్‌, కమిషనర్‌, డిప్యూటీ మేయర్‌ వనమా బాల వజ్రబాబు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శారదకాలని వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రంలో, ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న 19 మంది బాదితులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని సూపరిండెంట్‌ను ఆదేశించామన్నారు. ఇప్పటికే 3 రోజుల క్రితం సంగడిగుంట తిరుమలచారి కాలనిలో జరిగిన సంఘటనపై తక్షణం స్పందించి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బంది పరిసర ప్రాంతాల్లో డోర్‌ టు డోర్‌ తాగునీటి నమూనా పరీక్షలు, క్లోరిన్‌ పరీక్షలు ప్రభుత్వ మెడికల్‌ కాలేజిలోని రీజినల్‌ ల్యాబ్‌ వారిచే పరీక్షించామన్నారు. తాగునీటిలో క్లోరిన్‌ కూడా తగిన మోతాదులో ఉన్నట్లు నిర్ధారణైందని, ప్రజారోగ్య అధికారులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటి ఆరోగ్య సర్వే చేశారని, అందులో ఎవ్వరికీ డయేరియా ప్రభావం లేదని రిపోర్ట్‌ వచ్చిందని తెలిపారు. శారదాకాలనికి చెందిన పద్మ మృతి డయోరివా వల్ల కాదని తెలిసిందని, పోస్ట్‌మార్టం కూడా చేపట్టాలని ఆదేశించామని అన్నారు. శారదాకాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక మెడికల్‌ క్యాంప్‌ చేశామన్నారు. ఇంజినీరింగ్‌ అధికారులు నగరంలోని ప్రతి రిజర్వాయర్‌ పరిధిలో తాగునీటి సరఫరా జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శుల ద్వారా ఫస్ట్‌ పాయింట్‌ నుండి టేయిలేండ్‌ వరకు క్లోరిన్‌ శ్యాంపిల్స్‌ సేకరించాలని ఆదేశించామన్నారు. శారదా కాలనీ రిజర్వాయర్‌ షెడ్యుల్‌ మేరకు జనవరి 20న క్లీన్‌ చేయించామని, అన్ని రిజర్వాయర్లు కూడా నిర్దేశిత గడువు మేరకు క్లీన్‌ చేయించామని చెప్పారు.

➡️