తాగునీటిలో తగుమోతాదులోనే క్లోరిన్‌

Feb 12,2024 00:33

తాగునీటి నమూనాలు పరిశీలిస్తున్న కమిషనర్‌
ప్రజాశక్తి-గుంటూరు :
నగరంలో పరిశుభ్రమైన తాగునీటిని అందించేందుకు జిఎంసి పటిష్ట చర్యలు తీసుకుంటుందని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి తెలిపారు. ఆదివారం తెల్లవారుజాము 4 గంటల నుండి శ్రీనగర్‌, శారదా కాలని, వసంతరాయపురం, ఐపిడి కాలనీ, సంగడిగుంట తదితర ప్రాంతాల్లో పర్యటించారు. మెడికల్‌ కాలేజిలోని రీజినల్‌ ల్యాబ్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి తాగునీటి సరఫరా సమయంలో నివాసాల వద్ద నుండి తాగునీటి నమూనాలు సేకరించి క్లోరిన్‌ శాతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ బాధితులున్న ప్రాంతాల నుండి తాగునీటి నమూనాలు సేకరించామని, అందులో క్లోరిన్‌ శాతం తగిన మోతాదులోనే ఉన్నట్లు గుర్తించామని, కావున ప్రజలు ఆందోళనకు గురికావొద్దని అన్నారు. తాగునీటి సమస్యలపై యుద్ధ ప్రాతిపదికన స్పందించేందుకు జిఎంసి ప్రధాన కార్యాలయంలో 0863-2345103 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామని తెలిపారు. నీటి కాలుష్య అనుమానిత ప్రాంతాలైన శ్రీనగర్‌, శారదకాలని, సంగడిగుంట ప్రాంతాలకు ముగ్గురు డిప్యూటీ కమిషనర్లను ప్రత్యేక అధికారులుగా నియమించామన్నారు. ఉండవల్లి నుండి తక్కెళ్లపాడు హెడ్‌వాటర్‌ వర్క్స్‌ వరకు పైప్‌లైన్‌ పరిశీలనకు ఈఈ కొండారెడ్డి, హెడ్‌వాటర్‌ వర్క్స్‌, సంగం జాగర్లమూడి వాటర్‌వర్క్స్‌లో క్లోరినేషన్‌, ఫిల్టరేషన్‌, ల్యాబ్‌లో పరీక్షలను డిఈఈ హనీఫ్‌కు, హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ నుండి తాగునీటి సరఫరాని ఈ.ఈ. శ్రీనివాస్‌, ఏఈ బాబర్‌లు, శారద కాలని, శ్రీనగర్‌, సంగడిగుంట ప్రాంతాల్లో త్రాగునీటి పైప్‌లైన్ల పరిశీలన, క్లోరినేషన్‌, ఎక్కడైనా లీకులు ఉంటే తక్షణ మరమ్మతులకు ఈ.ఈ. కోటేశ్వరరావు, డిఈఈలు రమేష్‌బాబు, మహ్మద్‌ రఫిక్‌, రాము, ఏఈలు అనూష, శ్రీకాంత్‌కు ప్రత్యేక విధులు కేటాయించామని వివరించారు. ఇంజినీరింగ్‌ అధికారులు ముందస్తు అనుమతి లేకుండా సెలవు పెట్టరాదని స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం నగరంలోని బిఆర్‌ స్టేడియం, శారద కాలని, ఐపిడి కాలని, నల్ల చెరువు తదితర రిజర్వాయర్ల పరిధిలో తాగునీటి సరఫరా జరిగే సమయంలో 53 మంది ఎమినిటి కార్యదర్శులతో క్లోరిన్‌ స్యాంపిల్స్‌ కోసం ప్రత్యేక బందాలుగా ఏర్పడి 537 స్యాంపిల్స్‌ సేకరణ చేశారని, వాటిలో క్లోరిన్‌ తగు మోతాదులోనే ఉందని గుర్తించడం జరిగిందని తెలిపారు. అనంతరం శారదా కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న బాధితులతో, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. నగర ప్రజలు కూడా తాగునీటిని కాచి చల్లార్చి తాగాలని సూచించారు. పర్యటనలో ఎస్‌ఈ (ఎఫ్‌ఏసి) సుందర్రామిరెడ్డి, ఈఈ కోటేశ్వరరావు, ఎంహెచ్‌ఓ (ఎఫ్‌ఏసి) మధుసూదన్‌ పాల్గొన్నారు.

➡️