తాగు నీటి సమస్యపై టిడిపి ఆందోళన

Feb 9,2024 20:57

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌ : మండలంలోని డోకిశీలలో గత పది రోజులుగా గ్రామస్తులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యపై శుక్రవారం టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర ఆధ్వర్యంలో మహిళలతో కలిసి ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైలెట్‌ పథకంలో సాంకేతిక సమస్యల వల్ల 12 రోజులుగా గిరిజన గ్రామాల్లో నీటి సరఫరా లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనిపై అధికారులు స్పందించి కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాటు కూడా చేయకపోవడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. తాగునీటి కోసం మహిళలు చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. నీటి కోసం మహిళలు పడుతున్న పాట్లు కలచి వేసిందని, అంతేకాక గ్రామంలో కాలువలు శుభ్రం చేయకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, అధికారులు స్పందించి చొరవ చూపాలని విజయ చంద్ర అధికారులను కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు గొట్టాపు వెంకట నాయుడు తదితరులు పాల్గొన్నారు.

➡️