తీసుకోగలమా?

Apr 1,2024 23:15

ఇంటి వద్దకే పెన్షన్‌ ఇవ్వాలని ప్లకార్డు ద్వారా కోరుతున్న నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ వికలాంగుడు కొరిటాల శ్రీనివాసరావు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ చేయరాదని పెట్టిన నిబంధనలపై వికలాంగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇంటి వద్దకే వచ్చి పింఛను అందించడం వికలాంగులు, వృద్ధులకు సౌలభ్యంగా ఉందని, ఇప్పుడు మళ్లీ సచివాలయాల వద్దకు వెళ్లి గంటల తరబడి వరుసలో నిల్చొని తీసుకోవాలంటే అనేక సమస్యలు వస్తాయని వాపోతున్నారు. పల్నాడు జిల్లాలో పింఛను తీసుకునే వికలాంగులు 20 వేల మందికి పైగా ఉన్నారు. వీరిలో 18 శాతం మంది ఒకటి లేదా రెండు కాళ్లు లేనివారు, మంచానికే పరిమితమైన వారు ఉన్నారు. వీరందరికీ ఇప్పుడు పింఛను ఎలా తీసుకోవాలనే విషయంపై ఆందోళన నెలకొంది. ఇప్పుడిస్తున్నట్లే ఇళ్ల వద్దకే పింఛను వచ్చేలా ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని వీరంతా కోరుతున్నారు.
వికలాంగులకు ఇంటి వద్దే ఇవ్వాలిక
ర్నాటి కృష్ణమూర్తి, నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు.
ఇప్పటి వరకు పింఛను నేరుగా ఇంటికి రావడంతో మాకు ఇబ్బందేమీ రాలేదు. పోలియో బారిన పడి రెండు కాళ్ళు చచ్చుబడిన వారు, పక్షవాతం బారిన పడి వారు సచివాలయాల వద్దకు వెళ్లాలంటే జోగాడుతూ పోవాల్సి వస్తుంది. లేదా సహాయకులను పెట్టుకుని వెళ్లాలి. ఎండలు ఎక్కువగా ఉన్నందు వల్ల ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదు. మహిళలు, మంచానికే పరిమితమైన వారిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయం దిశగా ఎన్నికల కమిషన్‌ ఆలోచించి వికలాంగులకు ఇంటి వద్దకే పించను ఇచ్చే ఏర్పాటు చేయాలి.
ప్రత్యామ్నాయాన్ని ప్రభుత్వమే అన్వేషించాలి
ఎస్‌. ఆంజనేయ నాయక్‌, సిఐటియు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి.
ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న దృష్ట్యా వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే పింఛను ప్రక్రియ నిలిపివేయాలనే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వమే ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించాలి. నడవలేని వృద్ధులకు, మంచానికే పరిమితమైన వికలాంగులకు కచ్చితంగా ఇంటి వద్దనే యథావిధిగా పింఛను అందించాలి. ఇప్పటి వరకూ వాలంటీర్ల ద్వారా అందిన సేవలకు ఆటంకం లేకుండా, ఎన్నికల నియమావళిని అనుసరిస్తూ ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలి.
వికలాంగులు ఎక్కడుంటే అక్కడే ఇవ్వాలి
ఏనుగంటి కృష్ణారావు, తుంగపాడు గ్రామం, రొంపిచర్ల, మండలం.నవభారత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి.
ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను పెన్షన్‌ పంపిణీకి దూరంగా ఉంచడం హర్షణీయమైనా వికలాంగులు, వృద్ధులకు ఇప్పటివరకు పంపిణీ చేసిన మాదిరిగానే పింఛనును ఇంటివద్దే పంపిణీ చేయాలి. గతంలో లబ్ధిదారులు రెండు నెలల పాటు అందుబాటులో లేకపోయినా 3వ నెలలో మొత్తం పెన్షన్‌ అందజేసేవారు. ప్రస్తుతం ఒకనెల పింఛను తీసుకోకపోయినా మరుసటి నెలలో పింఛను రాదని చెప్పారు. దీంతో అనారోగ్యంతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నా, ఇతరత్రా వ్యక్తిగత పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినా పింఛను కోసం నానా తిప్పలు పడి రావాల్సి వస్తోంది. వికలాంగులు ఏ ప్రాంతంలో ఉన్నా అక్కడే పింఛను పొందేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. వాలంటీర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లి పింఛను పంపిణీ చేసే క్రమంలో బస్సు ఛార్జీలతో పాటు అదనంగా డబ్బులు వసూలు చేశారు.
యథావిధిగానే పంపిణీకి అవకాశం ఇవ్వాలి
నల్లపాటి రామారావు, పిడిఎం సీనియర్‌ నాయకులు.
ఎండలు విపరీతంగా ఉన్న దృష్ట్యా సచివాలయాల వద్దకు వెళ్లి పింఛను తీసుకోవాలంటే లబ్ధిదారులు ఇబ్బంది పడతారు. పింఛనుదారుల్లో అధిక శాతం మంది వికలాంగులు, మంచానికే పరిమితమై అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశించడంతో అనేకమంది ఆందోళన చెందుతున్నారు. నిబంధనలు సడలించి యథావిధిగానే పింఛన్లు పంపిణీకి అవకాశం ఇవ్వాలి.

➡️