దగదర్తి విమానాశ్రయంపై అసత్యాలు

Apr 1,2024 21:26
ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి

ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి
దగదర్తి విమానాశ్రయంపై అసత్యాలు
– దళిత సంఘర్షణ సమితి విమర్శలు
ప్రజాశక్తి-కావలి : విజయసాయిరెడ్డి, బీద మస్తాన్‌ రావులు విమానాశ్రయం తెస్తామనడం మరోసారి స్థానిక ప్రజలను మోసం చేయడమేనని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి విమర్శించారు. సోమవారం కావలి పట్టణంలోని స్థానిక ”జర్నలిస్ట్‌క్లబ్‌”లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి మాట్లాడుతూ దగదర్తిలో ఆదివారం వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారంలో దగదర్తి ప్రజలనే కాకుండా బోగోలు, అల్లూరు, కొడవలూరు చుట్టుపక్కల మండలాల ప్రజలను మోసానికి గురిచేస్తున్నారని తెలిపారు. ఆరు సంవత్సరాల కిందట చంద్రబాబు నాయుడు ప్రారంభించిన దామవరం విమానాశ్రయం 1800 ఎకరాలలోప్రారంభమైనా 670 ఎకరాలకు మాత్రమే డబ్బులు ఇచ్చారని తెలిపారు. మిగతా 335, 336 సర్వే నెంబర్లలో ఇంకా 700 ఎకరాలకు డబ్బులు ఇవ్వాల్సి ఉందన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత చంద్రబాబునాయుడు ప్రారంభించినవి అన్నీ రద్దు చేసి కందుకూరు నియోజకవర్గంలోని వీరేపల్లి నుంచి చాకిచర్ల వరకు సర్వే చేసి ఇక్కడి విమానాశ్రయాన్ని రద్దు చేశారని తెలిపారు. మళ్లీ ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి స్థానిక ప్రజలకు ఉద్యోగాలు చేయకుండా, బి.ఎం.ఆర్‌. లాంటి కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అస్సాం, బెంగుళూరు వంటి ప్రాంతాల నుంచి మంచి నిపుణులను తెచ్చుకుని పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. స్థానిక యువకులకు మాత్రం రొయ్య పొట్టు ఒలిచే ఉద్యోగాలు ఇస్తున్నారని తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. భూములు మాత్రం లాక్కొన్నారని తెలిపారు. అన్నీ కూడా పేద వర్గాలకు చెందిన భూములకు ఎకరాకు రెండు లక్షలు ఇచ్చి 200 ఎకరాలు గుంజుకున్నాడని తెలిపారు. అదే విధంగా ఎస్‌.ఆర్‌.శంకరన్‌ ఇచ్చిన బాలకార్మికుల పాఠశాల 13 ఎకరాలను కూడా ఫ్యాక్టరీలో కలుపుకున్న వారు నీతులు చెపుతున్నారని తెలియజేశారు. స్థానిక యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని జగనన్న చెపుతున్నప్పటికీ ఒక్కరికి కూడా ఇవ్వడం లేదన్నారు. ఇవ్వకపోగా స్థానిక యువకులు సారాయి కేసులు, ఇతర కేసుల్లో ఇరుక్కుని జైలుపాలు అవుతున్నారని తెలిపారు. గిరిజనుల చేతివృత్తి శిక్షణ కేంద్రం నిర్మించి ఆరు సంవత్సరాలు అవుతున్నా, దాని గురించి పట్టించుకోలేదన్నారు. మళ్లీ ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చి విమానాశ్రయం తెప్పిస్తామనడం ఘోరమైన విషయమన్నారు. కార్యక్రమంలో జరుగుమల్లి విజయరత్నం, చౌటారి వెంకటరత్నం, కంకణాల ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.

➡️