దోమల నివారణ చర్యలు

Mar 31,2024 21:11

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం:  గ్రామాల్లో ఫీవర్‌ సర్వేలెన్స్‌ చేపట్టి మలేరియా, డెంగీ తదితర జ్వరాలను సత్వరమే గుర్తించాలని జిల్లా మలేరియా అధికారి (డిఎంఒ) డాక్టర్‌ టి.జగన్మోహనరావు స్పష్టం చేశారు. మండలంలోని జర్న గ్రామాన్ని శనివారం రాత్రి వైద్య బృందంతో సందర్శించి దోమల నివారణకు సిబ్బంది అక్కడ చేపట్టిన ఫాగింగ్‌ నిర్వహణను ఆయన పరిశీలించారు. అదే రోజు గ్రామంలో దోమల నివారణ మందు స్ప్రేయింగ్‌, ఫీవర్‌ సర్వలెన్స్‌ చేయించారు. జ్వర నిర్ధారణ పరీక్షల నివేదికలను ఆయన పరిశీలించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా జ్వరం అనిపిస్తే గ్రామంలో ఉన్న వైద్య సిబ్బందికి వెంటనే తెలియజేయాలన్నారు. దోమ తెరల వినియోగంపై అవగాహన కల్పించారు. వేసవి రీత్యా శరీరంలో నీటి శాతం తగ్గుతూ వస్తుందని, కావున తరచుగా నీరు, ద్రావణాలు తీసుకోవాలని, లేకపోతే శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపారు. పిల్లల విషయంలో మరింత శ్రద్ధ చూపాలని వివరించారు. వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు ఫీవర్‌ సర్వే చేపట్టి జ్వర లక్షణాలున్న వారిని గుర్తించిన వెంటనే నిర్ధారణ పరీక్షలు జరపాలని ఆదేశించారు. సిబ్బంది సమన్వయంతో దోమల నివారణా చర్యలు చేపట్టి, డ్రైడే పాటించేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. సమిష్టి కృషితో జ్వరాలు ప్రబలకుండా నివారించవచ్చని అన్నారు. అనంతరం డాక్టర్‌ జగన్మోహన్‌ దుడ్డుఖల్లు పిహెచ్‌సిని తనిఖీ చేశారు. ఒపి, ల్యాబ్‌ రికార్డులు తనిఖీ చేసి జ్వరాలు ఏమేరకు నమోదవుతున్నాయి, వాటి నిర్ధారణ పరీక్షల నివేదికలు పరిశీలించారు. కార్యక్రమంలో ఎఎంఒ సూర్యనారాయణ, సబ్‌ యూనిట్‌ అధికారి నారాయణరావు, పంచాయతీ సెక్రటరీ రామకృష్ణ, ఇఒ సత్యరాజు, ఎంటిఎస్‌ ఆదినారాయణ, వైద్య సిబ్బంది కావేరి, రోషిణి, ధర్మారావు, గోవిందరావు, అంగన్వాడీ సిబ్బంది శోభారాణి, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.

➡️