నరసరావుపేటలో మూడోసారి నెల్లూరివారి పోటీ

Feb 13,2024 23:18

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి రాంబాబు తదితరులు
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు ఎంపీ అభ్యర్థిగా వైసిపి తరుపున పోటీ చేయనున్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌ బుధవారం రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు వైసిపి శ్రేణులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. దీంతో పల్నాడు జిల్లాలో రాజకీయం వేడెక్కింది. గతంలో నరసరావుపేట పార్లమెంటు స్థానం నుండి రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఉద్దండులు పోటీ చేశారు. ఇక్కడి నుంచి గెలిచిన వారు దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కాసు బ్రహ్మానందరెడ్డి, నెదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కొణిజేటి రోశయ్యలు ఇక్కడ నుంచి ఎంపీలుగా గెలిచిన వారే. ఈ సారి గత సంప్రదాయాలను పాటించకుండా వైసిపి అభ్యర్థిగా బీసీ సామాజిక తరగతికి చెందిన వారిని పోటీకి పెట్టడం చర్చనీయాంశమైంది. బీసీ సామాజిక తరగతికి చెందిన వారు పార్టీలకు అతీతంగా వైసిపి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిసింది. పార్లమెంట్‌ పరిధిలో 17 లక్షల మందికి పైగా ఓటర్లుండగా వీరిలో అత్యధిక భాగం బీసీలు కావడం, వీరిలోనూ 1.25 లక్షల మందికి పైగా యాదవ సామాజిక తరగతికి చెందినవారు కావడం గమనార్హం.నెల్లూరు జిల్లాకు చెందిన నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి 1999లో ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచారు. 2004లో మేకపాటి రాజమోహన్‌రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ వైసిపి తరపున పోటీ చేస్తున్నారు. ఆయన కోసం వైసిపి ఇప్పటికే నరసరావుపేటలో కార్యాలయాన్ని, నివాస గృహాన్ని సిద్ధం చేసింది. బుధవారం నరసరావుపేటకు వచ్చే ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పల్నాడు రోడ్డులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పెట్లూరివారిపాలెం నుంచి ర్యాలీగా సభా ప్రాంగణానికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
బీసీల ద్రోహి శ్రీకష్ణదేవరాయులు : మంత్రి అంబటి
ప్రజాశక్తి – సత్తెనపల్లి టౌన్‌ : బీసీలకు ద్రోహం చేసిన లావు శ్రీకృష్ణదేవరాయులు పార్లమెంటు పరిధిలోని ప్రజలను ఓట్లు ఎలా ఆడుగుతారని నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. స్థానిక వైసిపి కార్యాలయంలో వైసిపి శ్రేణులతో సమావేశమైన మంత్రి రాంబాబు మాట్లాడుతూ నర్సరావుపేట పార్లమెంటు స్థానాన్ని బీసీలకు వైసిపి ప్రకటించారనే అక్కసుతో పార్టీని శ్రీకృష్ణదేవరాయలు వీడారని అన్నారు. అనీల్‌కుమార్‌ యాదవ్‌ను ఎంపీగా ఇక్కడి నుండి నుండి గెలిపించాలని, అందులో భాగంగా బుధవారం నర్సరావుపేటలో నిర్వహించే భారీ బహిరంగ సభకు తరలిరావాలని వైసిపి శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం సభ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుంటూరు యార్డు చైర్మన్‌ ఎన్‌.రాజనా రాయణ, నాయకులు ఆర్‌.పురుషోత్తం, ఎం.సుబ్బారెడ్డి, ఎన్‌.శ్రీనివాసరావు, బి.లింగారెడ్డి పాల్గొన్నారు.

➡️