నర్సిపురంలో వ్యక్తి హత్య

Jan 10,2025 20:44

 ప్రజాశక్తి- వీరఘట్టం :  పార్వతీపురం మన్యంజిల్లా వీరఘట్టం మండలం సంత నర్సిపురం గ్రామంలో చింత రామకృష్ణ (58) హత్యకు గురయ్యాడు. రామకష్ణ అదే గ్రామానికి చెందిన బందలుప్పి కిరణ్‌కు కొద్దిరోజుల కిందట కొంత నగదును అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని రామకృష్ణ అడగగా ఇద్దరి మధ్య మాట మాట పెరిగి గురువారం రాత్రి కొట్లాటకు దారితీసింది. దీంతో రామకృష్ణను కిరణ్‌ బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. గమనించిన సమీప వ్యక్తులు విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చి వెంటనే రామకృష్ణను గ్రామంలోని ప్రైవేటు వైద్యుడివద్ద చూపించారు. మెరుగైన వైద్యం కోసం ఇతర ప్రాంతానికి తరలించేందుకు 108 వాహనం వచ్చినప్పటికీ అప్పటికే రామకృష్ణ మృతి చెందాడని తెలిపారు. విషయం తెలుసుకున్న పాలకొండ సిఐ చంద్రమౌళి గ్రామానికి చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పాలకొండ నుండి క్లూస్‌ టీం కూడా గ్రామానికి చేరుకొని పరిశీలించింది. మృతుడి భార్య ప్రమీల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.

➡️