నష్టపరిహారం ఇవ్వాలి

Mar 1,2024 23:56

దీక్ష శిబిరం వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్సీ లక్ష్మణరావు
ప్రజాశక్తి – దుగ్గిరాల :
శుభం మహేశ్వరి కోల్డ్‌ స్టోరేజీలో అగ్ని ప్రమాదం సంభవించి పసుపు పంటను నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ మండల కేంద్రమైన దుగ్గిరాలలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్ద బాధిత రైతులు శుక్రవారం రిలేదీక్షలు చేపట్టారు. దీక్షలను ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాకముందే రైతులకు నష్టపరిహారం చెల్లించే విధంగా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ప్రస్తుత ధరల ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, ఈ సమస్యపై కలెక్టర్‌తో వ్యవసాయ శాఖ మంత్రితో చర్చిస్తామని చెప్పారు. అవసరమైనతే బాధిత రైతులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి వద్దకు తీసుకు వెళ్తామన్నారు. బాధిత రైతుల జాబితాను ప్రమాణికంగా తీసుకొని ప్రకృతి విపత్తుల నిధి నుండి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతులకు న్యాయం చేసేలా ఇన్సూరెన్స్‌ కంపెనీపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలన్నారు. యజమానికి సంబంధించి లోపాలున్నాయని, దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేయాలని కోరారు.పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌ జొన్న శివశంకర్‌ మాట్లాడుతూ ఎంపీలు అయోధ్యరామిరెడ్డి, విజయసాయిరెడ్డి, మంత్రి గోవర్ధన్‌రెడ్డి, కలెక్టర్లను కలిసినా ప్రభుత్వం నుండి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీమా కంపెనీ, కోల్డ్‌ స్టోరేజ్‌ యజమానులకు లాయర్లుంటారని, నష్టపోయిన రైతులకు దిక్కెవరని ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం, రైతు సంఘాలతో కోల్డ్‌ స్టోరేజ్‌ యజమాని సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ రిపోర్టు ప్రకారం నష్టపరిహారం చెల్లించాలన్నారు. వ్యవసాయ మార్కెటింగ్‌ యార్డు ఒక జాబితా, కోల్డ్‌ స్టోరేజ్‌ యజమాని మరొక జాబితా ప్రకటించారని, ఇది రైతులను ఆయోమయంలోకి నెట్టిందని అన్నారు. బాధిత రైతులను ప్రభుత్వం సత్వరమే ఆదుకోకుంటే రోడ్లు దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు లోకం భాస్కరరావు, ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు నష్టపోయారన్నారు. పంట పండించినప్పుడే మద్దతు ధర కల్పించి ప్రభుత్వం కొనుగోలు చేసి ఉంటే కోల్డ్‌ స్టోరేజీల్లో నిల్వ చేసుకునే పరిస్థితి రైతులకు వచ్చేది కాదన్నారు. పరిహారం దక్కేవరకూ రైతులంతా ఢిల్లీలో రైతుల పోరాట స్ఫూర్తితో ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దీక్షల్లో పసుపురైతు బాధిత కమిటీ కన్వీనర్‌ వి.వెంకట్రామయ్య, కో-కన్వీనర్‌ కె.వెంకటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.అజరు కుమార్‌, ఉపాధ్యక్షులు ఎం.శివసాంబిరెడ్డి, నాయకులు ప్రసాద్‌రెడ్డి, కె.శివరామకృష్ణయ్య, కె.సురేంద్ర, బి.అగస్టీన్‌, వి.భారతి, బి.ధనలక్ష్మి, డి.వెంకట్‌రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.వెంకటేశ్వరరావు, సిపిఎం మండల కార్యదర్శి జె.బాలరాజు, వై.బ్రహ్మేశ్వరరావు, కె.కోటయ్య, సిహెచ్‌ పోతురాజు పాల్గొన్నారు.

➡️