నష్టపరిహారం కోసం మరోసారి బ్యాంకు ముట్టడి

Apr 2,2024 23:19

ఆందోళన చేస్తున్న బాధితులు
ప్రజాశక్తి – క్రోసూరు :
బంగారం కనబడకుండా పోయిన గోల్డ్‌లోన్‌ ఖాతాదారులందరికీ నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మండలంలోని దొడ్లేరు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఎదుట బాధిత రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. బ్యాంకుకు తాళాలేసి బ్యాంకు మేనేజర్‌ను లోపలికి పోనివ్వకుండా ముట్టడించారు. గోల్డ్‌ లోన్‌ బాధితుల సంఘం కన్వీనర్‌ టి.హనుమంతరావు మాట్లాడుతూ బాధితులందరికీ వడ్డీ రాయితీ ఇవ్వాలని, బ్యాంకు వారు గుర్తించిన పేర్లతో పాటు మిగిలిన వారికి కూడా వెంటనే విచారణ చేసి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలిసిన సిజిజిబి బ్యాంక్‌ ప్రతినిధి చంద్రశేఖరరావు అక్కడికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. బంగారం కోల్పోయామని అర్జీ పెట్టుకున్న ఖాతాదారులు 498 మంది ఉన్నారని, బ్యాంకు ముందుగా గత రికార్డులతో సరిపోయిన 321 మందికి ఖాతాదారులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పారు. మిగిలిన 177 మంది ఖాతాదారుల్లో 62 మంది ఖాతాదారులు పెట్టుకున్న అర్జీకి సరిపోలేదని, సుమారు 100 మంది ఖాతాల వరకు మొదటి సంవత్సరం బంగారం పెట్టిన నేపథ్యంలో వారు కోల్పోయిన బంగారం సరి చూసుకోవడానికి రికార్డు లేనందున మరొకసారి కమిటీతో చర్చించి నష్టపరిహారంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. బాధిత రైతులకు నష్టం కలగకుండా చూస్తామన్నారు. బ్యాంకు మేనేజర్‌ శివశంకర్‌ మాట్లాడుతూ మొదటి దశలో నమోదైన 321 మంది రైతులకు పోస్ట్‌ ఆఫీస్‌ ద్వారానే రోజుకి 50 పేర్లు చొప్పున నోటీసులు పంపిస్తామని, ఆ నోటీసు తీసుకొని వచ్చి బ్యాంకు వారి నిర్ణయాల మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని, ఒకవేళ నోటీసు బోర్డులో పేర్లుండి నోటీసులు అందని పక్షంలో వారం తరువాత మీకు గతంలో బ్యాంకు వారిచ్చిన ఎక్నాలెడ్జ్‌మెంట్‌ కాగితం తీసుకొని బ్యాంకు వారిని కలవాలని వివరించారు. బంగారం కోల్పోయిన రైతులకు 2023 ఆగస్టు 19 నుండి మార్చి 28 వరకు బాధిత రైతుల ఖాతాలపై వడ్డీ రాయితీ ఇచ్చేందుకుపై స్థాయి అధికారులు హామీ ఇచ్చారని, ఈ ఖాతాదారులకు సంబంధించి వడ్డీ లెక్కలు ఉన్నతాధికారులకు పంపిస్తున్నామని తెలిపారు. దీంతో ఆందోళన ముగిసింది. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు ఎ.ఆంజనేయులు, డి.నటరాజు, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వి.వెంకటేశ్వర్లు, గోల్డ్‌ బాధిత రైతుల సంఘం కమిటీ సభ్యులు ఎం.రామకృష్ణారెడ్డి, గన్‌సైదా, ఎన్‌.నాగుషరీఫ్‌, పి.ఆంజనేయులు, రవుఫ్‌, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, ఝాన్సీ, సునీత, బాజీ, రవి పాల్గొన్నారు.

➡️