నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే వచ్చా…

Mar 31,2024 21:03

ప్రజాశక్తి- శృంగవరపుకోట : చంద్రబాబు, లోకేష్‌ పంపిస్తేనే నియోజకవర్గ ప్రజలకు సేవ చేసేందుకే వచ్చానని అందరూ బలంగా ఆదేశిస్తే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతానని తన ప్రయాణం టిడిపి తోనే కొనసాగుతుందని నియోజకవర్గ యువనేత గొంప కృష్ణ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఆకుల డిపో వద్ద నిర్వహించిన బహిరంగ సభలో కృష్ణ మాట్లాడుతూ తాను, తన భార్య అమెరికాలో కార్పొరేట్‌ కంపెనీల్లో మంచి జీతాలకు పనిచేస్తున్నామని, డబ్బుకు, హోదాకు లోటు లేదని, అయితే ఈ సమయంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్‌లు ఎస్‌ కోట నియోజకవర్గం వెళ్లి అక్కడ పార్టీని అభివృద్ధి చేయాలని, బలంగా తయారు పరచాలని ఆదేశించినట్లు చెప్పారు. దీంతో తాను, తన భార్య చేస్తున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు వదిలి ఇక్కడికి వచ్చేశామన్నారు. గడిచిన రెండేళ్లుగా ఈ నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి అహర్నిశలు శక్తివంచన లేకుండా కృషి చేశామన్నారు. అయితే అధిష్టానం పార్టీ అభివృద్ధి చేయాలని చెప్పి టిక్కెట్‌ విషయంలో తనను మోసం చేసిందని అయినప్పటికీ తనకు టిడిపి అంటే అభిమానమేనని మీరు అందరూ బలంగా ఆదేశిస్తే తాను ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని చెప్పారు. ఇప్పటికే యువత కోసం, మహిళ సాధికారకత కోసం, రైతుల కోసం చేపట్టిన ప్రతి కార్యక్రమం అందరికీ తెలుసునన్నారు. గడిచిన రెండేళ్లలో పార్టీని ఎంత బలోపేతం చేశానో నాయకులతో పాటు ప్రజలు కూడా గమనించారన్నారు. పార్టీని ఇంత అభివృద్ధి చేసిన తనకు టిడిపి అధిష్టానం టిక్కెట్‌ ఇవ్వకపోవడం తనతో పాటు తనను నమ్ముకొని ఉన్న కేడరును అసంతృప్తికి గురిచేసిందన్నారు. ఈ తరుణంలో తనను వేలాదిమంది ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని కోరుతున్నారని దీనిని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అందరి ఆశీర్వాదం ఉంటే ఎమ్మెల్యేగా పోటీ చేసి తిరిగి టిడిపిలో చేరుతానని మాటిచ్చారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే రాష్ట్రంలో ఎస్‌ కోట నియోజకవర్గానికి గుర్తింపు వచ్చేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. తనను నమ్మి సభకు వేలాది మంది రావడం తనకు మరింత గుండే ధైర్యాన్నిచ్చిందన్నారు. అనంతరం ఆకులు డిపో నుంచి దేవి బొమ్మ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయవరపు చంద్రశేఖర్‌, గొరపల్లి రాము, గొంప వెంకటరావు, గొప్ప రమాదేవి, భారతి, త్రివేణి, రెడ్డి పైడి బాబు, లగుడు రవికుమార్‌, జుత్తాడ రామసత్యం, మంగరాజు తదితరులు పాల్గొన్నారు.

➡️