నీటి కోసం రోడ్డెక్కిన జనం

ప్రజాశక్తి-మార్కాపురం: మండల కేంద్రమైన తర్లుపాడులోని రైల్వే గేటు వద్దగల రజక కాలనీ, నాయుడుపల్లె కాలనీలలో నీటి సమస్యతో నెలల తరబడి జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు మూడు నెలలుగా నీరు అందుబాటులో లేదు. నీటి కోసం అక్కడి జనం అష్టకష్టాలు పడాల్సివస్తోంది. ఓపిక నశించిన జనం సోమవారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. తర్లుపాడు-మార్కాపురం రహదారిపై రాస్తారోకో చేపట్టారు. సుమారు గంటన్నర పాటు ఆందోళన కొనసాగింది. ఈ సందర్భంగా జనం ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సమస్య తీరుస్తారా లేదా అంటూ అధికారులను నిలదీశారు. ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్య తీసుకుపోయినా పరిష్కారం కాలేదన్నారు. ఇన్‌ఛార్జి ఎం చంద్రశేఖర్‌ ఆందోళనకారుల వద్దకు వచ్చారు. తక్షణమే ట్యాంకర్లు ఏర్పాటు చేస్తామన్నారు. నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు.

➡️