నులిపురుగుల నివారణ కార్యక్రమం ప్రారంభం

Feb 10,2024 00:08

పిల్లలతో అల్బెండజోల్‌ మాత్రలు మింగిస్తున్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు :
జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని పురస్కరించుకొని పురస్కరించుకొని జిల్లాలో 4.72 లక్షల మందికి అల్బెండజోల్‌ మాత్రల పంపిణీ శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఈనెల 16వ తేదీ వరకూ కొనసాగుతుంది. స్థానిక బ్రాడీపేటలోని శారదా నికేతన్‌ ఓరియంటల్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కళాశాలలోని విద్యార్థులకు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి స్వయంగా మాత్రలు మింగించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అల్బెండజోల్‌ మాత్రలు రెండు నుండి 19 ఏళ్ల వయస్సు గల పిల్లలు తప్పక వేసుకోవాలని, ఈ మాత్రలు ఫిబ్రవరి, ఆగస్టు మాసాల్లో ఏడాదికి రెండు సార్లు అందించి పిల్లల్లో రక్తహీనతను నిర్మూలించాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, జూనియర్‌ కళాశాలల్లో 4,72,534 మందికి విద్యార్థులకు అల్బెండజోల్‌ మాత్రలు మింగించాల్సి ఉందని చెప్పారు. నులిపురుగులు చిన్న సమస్యగా కనిపిస్తుందని, కానీ చాలా ప్రమాదకరమని, చేతులు శుభ్రంగా వుంచుకోకపోవడం వల్ల నులిపురుగుల సమస్యలు వస్తున్నాయని అన్నారు. ఏడాది నుండి రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్రను నీటిలో కలిపి తాగించాలన్నారు. 2-19 ఏళ్లవారికి పూర్తి మాత్రను మధ్యాహ్నం భోజనం చేసిన అరగంట తరువాత చప్పరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ విజయలక్ష్మీ, ఆర్‌బిఎస్‌కె కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ శ్రావణబాబు, డిపిఐఎం రత్నమన్మోహన్‌, శ్రీశారదా నికేతన్‌ స్కూల్‌ ప్రిన్సిపల్‌ ఉషాకుమారి, కళాశాల ప్రిన్సిపల్‌ కోటిరత్నం, కరెస్పాండెంట్‌ జి.శ్రీనివాసరావు, ఎంఇఒ జ్యోతి, గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్‌ రవీంద్రరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️