నేటి నుండి 6 లోగా పింఛన్ల పంపిణీ

Apr 2,2024 23:22

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా :
బుధవారం మధ్యాహ్నం నుండి 6వ తేదీలోగా సామాజిక పింఛన్ల పంపిణీని నూరుశాతం పూర్తి చేయాలని అధికారులను పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ఆదేశించారు. ఈ అంశమై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, మండల అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లతో జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్‌ నుండి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లబ్ధిదార్లలో అవగాహన కల్పించేలా టామ్‌టామ్‌ (ప్రచారం) చేయాలని, సచివాలయానికి వచ్చేవారిని సచివాలయం వచ్చి తీసుకునే విధంగా, వృద్ధులు వికలాంగులు వారి ఇంటి వద్దనే పొందే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. ప్రతి క్లస్టర్‌కు ప్రత్యేకాధికారిని నియమించి పర్యవేక్షించాలన్నారు. నిబంధన తెలిపే విధంగా సచివాలయాల వద్ద నోటీసు బోర్డులలో వివరాలు ఉంచాలన్నారు. ఎండ తీవ్రతను నేపథ్యంలో సచివాలయం వద్ద తాగునీరు, టెంటు వసతి, కుర్చీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు ఎండ తీవ్రత లేని వేళల్లో పింఛన్లు పంపిణీ చేపట్టాలన్నారు. పింఛన్లు పంపిణీలో వాలంటీర్లు, ప్రజాప్రతినిధుల జోక్యం ఉండకూడదని స్పష్టం చేశారు. ఆధార్‌తో మాత్రమే పింఛనివ్వాలన్నారు. పింఛన్లు పంపిణీ చేసే వారి వద్ద అథారిటీ లెటర్లు విధిగా ఉంచుకోవాలని చెప్పారు. ఏప్రిల్‌ 10న ఎన్నికల సిబ్బందికి శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ఎఫ్‌ఎస్‌టి టీములు తరచూ పర్యటిస్తూ ఉండాలని, 85 ఏళ్లు పైబడిన వారికి, వికలాంగులకు హోం ఓటింగ్‌ కల్పించే విధంగా 12డీ ఫారాలను బిఎల్వోలతో అందించాలని చెప్పారు. వేసవి తీవ్రత నేపథ్యంలో అవసరమైన చోట చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

➡️