నేను, ఎంపీ కలిసి టిడిపిలో చేరతాం : మక్కెన

Feb 27,2024 00:14

మాట్లాడుతున్న మక్కెన మల్లికార్జునరావు, పక్కన జీవీ ఆంజనేయులు
ప్రజాశక్తి – వినుకొండ :
చంద్రబాబు ద్వారానే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని నమ్మి టిడిపిలో చేరుతున్నానని మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు ప్రకటించారు. తనతో పాటు వినుకొండ నియోజకవర్గంలోని తన బృందమంతా టిడిపిలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఈ మేరకు టిడిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులును సోమవారం ఆయన నివాసంలో కలిశారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ ఎంపీ లావు శ్రీకష్ణదేవరాయలు, తాను జీవి ఆంజనేయులు నేతృత్వంలో త్వరలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరతామన్నారు. జీవి ఆంజనేయులును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పని చేస్తామన్నారు. వినకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు దౌర్జన్యాలు, దుర్మార్గాలు పెరిగాయని, లా అండ్‌ ఆర్డర్‌ పని చేయడం లేదని అన్నారు. తాను, ఎంపీ సమక్షంలోనే రైతు నరేంద్రపై ఎమ్మెల్యే చెప్పుతో దాడి చేయబోయారని, పైగా అతన్నే జైల్లో పెట్టించారని విమర్శించారు. మాచర్ల సీఎం ప్రోగ్రాంలో డాక్టర్‌ లతీష్‌రెడ్డిని దుర్భాషలాడారన్నారు. వ్యక్తిగత దూషణలు సరికాదని, శివశక్తి ఫౌండేషన్‌ సేవా కార్యక్రమాలను తప్పు పట్టవద్దని అనేక సార్లు చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఆయనకు తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల వద్ద నుండి తాను రూ.మూడు కోట్లు తీసుకున్నట్లు ఎమ్మెల్యే చేస్తున్న ప్రచారం అవాస్తవమన్నారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలను సిఎంతోపాటు స్థానిక ఎమ్మెల్యే విస్మరించారని, వినకొండకు తెస్తానని చెప్పిన పరిశ్రమలు, కళాశాలలు ఎక్కడని ప్రశ్నించారు. జనసేన టిడిపి సంయుక్త అధికారంలోకి రాగానే వల్ల అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి జైలుకు పంపించడం ఖాయమన్నారు. సమావేశంలో నాయకులు ఎల్‌.వెంకట్రావు, షమీంఖాన్‌, పివి సురేష్‌ బాబు, ఎం.కొండలరావు, జి.కోటేశ్వరరావు, పి.అయుబ్‌ ఖాన్‌, పి.నాగేశ్వరరావు, ఆర్‌.జగ్గారావు పాల్గొన్నారు.

➡️