పంటలకు నీటి ఎద్దడి

Feb 12,2024 00:43

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు, పల్నాడు జిల్లాలో పంటలకు నీటి ఎద్దడి పెరుగుతోంది. డిసెంబరు 4,5 తేదీల్లో సంభవించిన మిచౌంగ్‌ తుపాను తరువాత మళ్లీ వర్షాల్లేకపోవడంతో పంటలకు నీటి సమస్య ఏర్పడింది. అయితే దాదాపు 65 రోజులుగా వర్షాలు లేకపోవడం వల్ల నీటిఎద్దడి పెరిగింది. మరో వైపు ఎగువ నుంచి ప్రవాహం కూడా లేకపోవడం వల్ల నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోయాయి. పులిచింతల జలాశయంలో గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా ఆదివారం సాయంత్రం 6.20 టిఎంసిల నీటి నిల్వ మాత్రమే ఉంది. అలాగే నాగార్జున సాగర్‌లో గరిష్టనీటి నిల్వ 312 టిఎంసీలు కాగా ప్రస్తుతం 144.94 టిఎంసిలు మాత్రమేనీటి నిల్వ ఉంది. మొత్తం నిల్వలో 50 శాతం కంటే తక్కువగా ఉండటాన్ని డెడ్‌ స్టోరేజీగా పరిగణిస్తారు. ప్రస్తుతం తాగునీటికి తప్ప సాగునీటికి నీటిని విడుదల చేసే అవకాశం లేదని అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో 1.70 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మిర్చికి ఇంకా కనీసం రెండు తడులు అవసరం ఉంది. గత 65 రోజులుగా వర్షాలు లేకపోవడం, ఎండల తీవ్రత పెరగడం వల్ల మిర్చిపంటను కాపాడుకునేందుకు రైతులునానా తంటాలు పడుతున్నారు. ప్రధానంగా రబీలో సాగు చేసిన జొన్న, మొక్కజొన్న, కంది తదితర పంటలకు నీటి అవసరం ఎక్కువగా ఉంది. గురటూరు, పల్నాడు జిల్లాలో రబీలో అపరాల సాగు కూడా తగ్గింది. రబీలో గుంటూరు జిల్లాలో 1.80 లక్షల ఎకరాల్లో పంటలనుసాగు చేయాల్సి ఉండగా కేవలం 1.25లక్షల ఎకరాల్లోనే పంటలు వేశారు. పల్నాడు జిల్లాలో 1.42 లక్షల ఎకరాల్లో సాగవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు 85 వేల ఎకరాల్లోనే రబీ పంటలు వేశారు. పల్నాడు జిల్లాలో కంది విస్తీర్ణం మాత్రం స్వల్పంగా పెరిగింది. సాధారణ విస్తీర్ణం 2500 ఎకరాలు కాగా ఈఏడాది 11వేల ఎకరాల్లో కంది సాగు చేశారు. గుంటూరు జిల్లాలో 51 వేల ఎకరాలు జొన్న సాగు చేస్తారని అంచనా కాగా 25 వేల ఎకరాల్లోనే సాగు చేశారు. మొక్కజొన్న సాగు కూడా 52 వేల ఎకరాల్లో సాగు చేస్తారని అంచనా కాగా ఇప్పటి వరకు కేవలం 31 వేల ఎకరాల్లోనే వేశారు. 22 వేల ఎకరాల్లో శనగ సాగు చేస్తారని అంచనా ఉండగా నవంబరులోనే 26 వేల ఎకరాల్లో శనగ వేశారు. అయితే దాదాపు 10 వేల ఎకరాల్లో శనగ పైరు తుపానుకు నీట మునిగి దెబ్బతింది. 9500 ఎకరాల్లో మినుము సాగు అవుతుందని అంచనా వేయగా కేవలం 15 వేల ఎకరాల్లో సాగు అయింది. పెసర 22 వేల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 21 వేల ఎకరాల్లో చేశారు. పల్నాడు జిల్లాలో 20 వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేయాల్సి ఉండగా 7500 ఎకరాలలో సాగు చేశారు. 25 వేల ఎకరాల్లో శనగ సాగుచేస్తారని అంచనా కాగా 43 వేల ఎకరాల్లో సాగు చేశారు. 5 వేల ఎకరాల్లో మినుము సాగు చేయాల్సి ఉండగా నాలుగు వేల ఎకరాల్లోనే సాగు చేశారు.ఈఏడాది ఖరీఫ్‌ సీజన్‌ ముగిసే సమయంలో తీవ్ర వర్షాభావం ఏర్పడటం, అక్టోబరు మొత్తం వర్షాలు లేకపోవడం, 21 రోజుల పాటు వేడిగాలలు వీయడం, నాగార్జున సాగర్‌, పులిచింతల జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రబీ సాగు పూర్తిస్థాయిలో జరగలేదు. డిసెంబరులో వచ్చిన మిచౌంగ్‌ తుపాను వచ్చి ఖరీఫ్‌ పంటలను నష్టం చేకూర్చినా అధిక వర్షాల వల్ల రెండో పంటగా జొన్న, మొక్కజొన్న సాగుకు రైతులను నడిపించింది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అధిక వర్షాల వల్ల దాదాపు వారం పాటు పొలాల్లో నీరు నిలిచిపోవడంతో భూమి తేమ బాగా ఉండటం, తరువాత వర్షాలు ఎంతో కొంత కురుస్తాయన్న నమ్మకరతో రైతులు రబీ సాగుకు ఉపక్రమించినా కొద్దిరోజుల్లో పంట చేతికి వచ్చే సమయంలో కొద్దిపాటి నీటి సరఫరా కూడా లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

➡️