పంట కోసం తంటాలు..!

Mar 31,2024 23:08

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : వర్షాలు సరిగా లేకపోవడం, సాగర్‌ నుండి సరిపడా నీరు సరఫరా అయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు సైతం ఇదే విషయాన్ని పదేపదే చెప్పారు. దీంతో రైతులు మిర్చి, మొక్కజొన్న, పొగాకు వంటి ఆరుతడి పంటలతోపాటు కూరగాయలు సాగు చేశారు. ప్రభుత్వ ప్రకటనతో బయపడిన కొంతమంది రైతులు పంటలే సాగు చేయలేదు. సాగైన పైర్లకు సైతం ప్రభుత్వం నీరు సరిగా ఇవ్వకపోవడంతో పైరును బతికించుకోవడానికి రైతులు నానా అగచాట్లు పడ్డారు. నరసరావుపేట మండలంలోని గురవాయపాలేనికి చెందిన రైతులు గ్రామ శివారులో ఉన్న చెరువు నుండి ట్రాక్టర్‌కు పంపుసెట్టు ద్వారా నీటిని తోడి సుమారు 3 కిలో మీటర్లకు పైగా నీటిని పైపులు ద్వారా పొలాలకు పెట్టుకున్నారు. ఇందుకుగాను ఆర్థికంగా ఎంతో భారాన్నీ మోస్తున్నారు. సొంత ట్రాక్టర్‌ ఉన్నా ఎకరా మిర్చి తోటకు తడిపేందుకు రూ.8 వేలు వరకూ ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం సాగులో ఉన్న పొలాల్లో కొన్నింటికి బోర్లున్నా ఎండ తీవ్రత నేపథ్యంలో భూగర్భ జలం అడుగంటి నీరు పడడం లేదు. ఈ నేపథ్యంలో పంటను వదిలేసుకోవడమా? ఎంత ఖర్చునైనా భరించి దూరాబారం నుండి నీరు తలరించుకోవడమా? అనే సందిగ్దంలో రైతులు సతమతం అవుతున్నారు. చేతికొచ్చిన పంటను చేజేతులా వదిలేసుకోక ఆప్పులు చేసి మరీ కష్టాలు పడుతున్నారు.
ఎకరా తడపడానికి రూ.8 వేల ఖర్చు
గుడిపూడి బాజి, కౌలురైతు, గురవాయపాలెం, నరసరావుపేట మండలం.
సొంతపొలంతోపాటు మరికొంత పొలాన్ని కౌలుకు తీసుకుని మిర్చి, పొగాకు సాగు చేశాను. నీరు సరిగా అందక పంట చివరి దశలో పొలాలు బెట్టకొచ్చాయి. గ్రామంలోని చెరువు నీటిని ట్రాక్టర్ల ద్వారా రెండు మూడు కిలోమీటర్ల వరకు పైపులు ద్వారా పొలానికి పెట్టుకుంటున్నాం. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదు. రైతులంతా వేలకువేలు ఖర్చుచేసి గ్రామ సమీపంలోని ఏడుమంగళం వాగు నీటిని నిల్వ చేసేందుకు గుంటలు తీయించి ఆ నీటి ద్వారా పంటలు బతికించాం. ఇప్పటికే దిగుబడులు తగ్గగా అదనంగా అవుతున్న ఖర్చులతో అప్పులపాలవుతున్నాం.
వ్యవసాయం అంటేనే భయమేస్తోంది
కోండ్రు పిచ్చారావు, కౌలురైతు, కుంకలగుంట, నకరికల్లు మండలం.
ఆరుతడికి నీరు వస్తాయన్న ఆశతో 11 ఎకరాలు మిర్చి సాగు చేశాను. నీరు రాకపోవడంతో మొక్కలు ఎండిపోయాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసి పొలానికి పెట్టాను. ఆ తర్వాత మిచౌంగ్‌ తుపానుకు బెట్ట పరిస్థితులు నుండి మొక్కలు పచ్చబడడంతో మళ్లీ సాగుపై ఆశలు చిగురించాయి. అయితే ఇప్పుడు నీరు లేకపోవడంతో పొలంలో బావి తీయించి ఇంజన్‌ ద్వారా పంటను సాగు చేశాను. ఆశించిన మేర నీటి లభ్యత లేకపోవడంతో కొంత పంట ఎండిపోయింది. దిగుబడి కూడా బాగా తగ్గి నష్టాల్లో కూరుకుపోయాం.

➡️