పకడ్బందీగా ఎన్నికల కోడ్‌ అమలు

Apr 1,2024 23:08

మీడియాతో మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు :
ఎన్నికల కోడ్‌ అమలుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి చెప్పారు. కోడ్‌ ఉల్లంఘనలపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని, అయినా అక్కడక్కడా ఉల్లంఘనలు కొనసాగుతున్నాని, వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెంటర్‌లో సోమవారం కలెక్టర్‌ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 13 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నామని, ఇప్పటి వరకూ ఆధారాలు చూపని రూ.1.60 కోట్లకుపైగా నగదు, ఇతర సామగ్రి సీజ్‌ చేశామని తెలిపారు. పెళ్లిళ్లు, హాస్పిటల్‌ వంటి వ్యక్తిగత అవసరాల కోసం నగదుతో ప్రయాణిస్తూ పట్టుబడితే వారు జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్‌లో అర్జీ అందచేస్తే ప్రతిరోజూ సాయంత్రం 3 గంటలకు జరిగే గ్రీవెన్స్‌ కమిటీ సమావేశంలో సమీక్షించి, పరిష్కరిస్తామని తెలిపారు. కోడ్‌ ఉల్లంఘించిన 124 మంది వాలంటీర్లు, నలుగురు కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఒక రెగ్యులర్‌ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఎన్నికల షెడ్యూలు గురించి వివరిస్తూ నెల 18 నుండి 25వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణ, 26న స్క్రూట్నీ, 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుందన్నారు. జూన్‌ 6వ తేదీ వరకూ కోడ్‌ అమలులో ఉంటుందని చెప్పారు. జిల్లాలో 1884 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయన్నారు. 1500 దాటిన చోట్ల, ఆగ్జలరీ బూత్‌లు ఏర్పాటుకు సంబంధించి 31 అదనపు బూత్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఈసీకి పంపించామన్నారు. జిల్లాలో తుదిజాబితా విడుదలయ్యే నాటికి 17,69,318 మంది ఓటర్లు ఉన్నారని, ఆ తర్వాత నమోదైన ఓట్లతో కలుపుకొని 17,83,488 ఓటర్లు ఉన్నట్లు వివరించారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ వరకూ ఓటు నమోదు చేసుకోవచ్చని తెలిపారు.ఈసీ ఆదేశాల మేరకు సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీకి చర్యలు తీసుకుంటామని, వాలంటీర్లు పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంటారన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులతోపాటు 33 రకాల కేటగిరీల ఓటర్లకు పోస్టల్‌ బ్యాలెట్‌ వేసేందుకు ఈసీ అనుమతి ఇచ్చిందన్నారు. రాజకీయ పార్టీల దరఖాస్తులకు సంబంధించి సింగిల్‌ విండో విధానంలో 48 గంటలలోగా అనుమతులు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజక వర్గంతోపాటు, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం పెంచటానికి కృషి చేస్తామన్నారు. సమావేశంలో జేసీ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియా మానిటరింగ్‌ సెంటర్‌ను కలెక్టర్‌ పరిశీలించారు. కారక్రమంలో ఐటి నోడల్‌ అధికారి రఘు, మీడియా నోడల్‌ అధికారి గాలిదేముడు, సమాచార శాఖ డిడి అబ్దుల్‌ రఫిక్‌ పాల్గొన్నారు.

➡️