పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

Feb 13,2024 00:30

ప్రజాశక్తి-గుంటూరు : జిల్లాలో మార్చి 18వ తేది నుండి 30 తేదీ వరకూ పదవ తరగతి పరీక్షలు, ఒకేషనల్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమీక్షల్లో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 420 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల నుండి 31,291 మంది విద్యార్థులు 147 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలకు హాజరు అవుతున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు ఉంటాయన్నారు. ఓఎస్‌ఎస్సీ అండ్‌ ఒకేషనల్‌ పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుండి సాయంత్రం 5.30 వరకు ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణకు 147 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 147 మంది డెపార్ట్మెంట్‌ ఆఫీసర్లు, 1642 మంది ఇన్విజిలెటర్స్‌ని నియమించినట్లు తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్ట్మెంటల్‌ ఆఫీసర్‌ను నియమిస్తామన్నారు. ప్రశ్నా పత్రాలు, జవాబు పత్రాల తరలింపు తదితర అంశాలపై సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్‌ షాపులను పరీక్షల సమయంలో మూసివేయించాలని, పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్‌ బందోబస్తు, 144 సెక్షన్‌ విధించాలని చెప్పారు. ప్రతి కేంద్రంలో సరైన ఫ్యాన్లు, విద్యుత్‌ సక్రమంగా వుండేటట్లు, విద్యుత్‌ అంతరాయం లేకుండా చూడాలన్నారు. పరీక్షలు రాయటానికి అనువైన టెబుల్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య నిర్వహణ, తాగునీరు, ఫస్డ్‌ ఎయిడ్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అందించాలన్నారు. సమావేశంలో జెసి జి.రాజకుమారి, డిఆర్‌ఒ పెద్ది రోజా, డిప్యూటీ కలెక్టర్‌ స్వాతి, ఆర్డీవో శ్రీఖర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్‌ (ఏసిజిఇ) కె.వెంకటరెడ్డి, అసిస్టెంట్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ కె.శివనాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️