పరిశ్రమ విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ

Feb 21,2024 21:00

 ప్రజాశక్తి – లక్కవరపుకోట :  మండలంలోని శ్రీరాంపురం గ్రామపంచాయతీలో ఉన్న మెసర్స్‌ మా మహామాయ ఉక్కు కర్మాగారం విస్తరణకు బుధవారం ప్రజా అభిప్రాయ సేకరణ చేశారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు డిఆర్‌ఒ అనిత, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు జాయింట్‌ చీఫ్‌ ఇన్‌ఛార్జి ప్రసాదరావు, ఇఇ సరిత తదితరులు పరిశ్రమ విస్తరణకు శ్రీరాంపురం , రెల్లిగైరంపేట పంచాయతీలతో పాటు పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. తొలుత పరిశ్రమ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న 1,30,065 టన్నుల స్పాంజ్‌ ఐరన్‌ ఉత్పత్తి సామర్థ్యం 708630 టన్నులకు పెంచేందుకుగాను, 1,34,400 టన్నుల ప్రస్తుత ఉత్పత్తి హాట్‌ బిల్లెట్స్‌ , ఇనుప కడ్డీలు ఉత్పత్తిని 880428 టన్నుల ఉత్పత్తిని పెంచేందుకు గాను, 1,21,250 టన్నుల ఇనుప రాడ్లు , ఫైల్‌ రాడ్స్‌ రౌండ్స్‌ ఉత్పత్తిని 7లక్షల టన్నులకు పెంచేందుకు గాను , వాటితో పాటు మరికొన్ని పెంచేందుకు ప్రతిపాదనను ప్రజలకు వివరించారు.అనంతరం శ్రీరాంపురం, రెల్లిగైరంపేట గ్రామ పెద్దలు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న పరిశ్రమల కారణంగా నలుపు రంగు బూడిద తమ గ్రామాలపై, పంట పొలాలపై, చెరువులపై వెదజల్లుతుందని తెలిపారు. అనంతరం డిఆర్‌ఒ అనిత మాట్లాడుతూ అభిప్రాయ సేకరణ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో పరిశ్రమ హెచ్‌ ఆర్‌ మురళీవర్మ , కన్సల్టెన్సీ ప్రసాదరావు , జెడ్‌పిటిసి తూర్పాటి వరలక్ష్మి , తాహశీల్దార్‌ ప్రసాదరావు , ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు పాల్గొన్నారు.

➡️