పాడి పశువుల పట్ల జాగ్రత్తలు తప్పనిసరి

Apr 1,2024 21:10

ప్రజాశక్తి – గరుగుబిల్లి :  ప్రస్తుతం ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో రైతులు పాడి పశువులను ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో కాకుండా ఉదయం 9 గంటల్లోపు, సాయంత్రం 5 గంటల తర్వాత వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మాత్రమే బయట మేతకు వదలాలని మండల పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్‌ సూచించారు. మండలంలోని ఉల్లిభద్ర పశు సంవర్ధకశాఖ కార్యాలయంలో సోమవారం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుత వేసవికాలంలో పాడి పశువుల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. రోజులో మూడు, నాలుగు పర్యాయాలు చల్లని నీటితో పశువులను కడగాలని పేర్కొన్నారు. రేకులతో ఉన్న పశువుల షెడ్లపై గడ్డిని కప్పి, మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉన్న సమయాల్లో నీటిని చల్లాలన్నారు. అలాగే వడగాడ్పుల ప్రభావం లేకుండా పశువుల శాలల చుట్టూ గోనెలతో పరదాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈపరదాలను కూడా మధ్యాహ్న సమయంలో నీటితో తడపాల్సి ఉందని సూచిం చారు. పశువులశాలల పైభాగంలో తెలుపురంగు పెయింట్‌ వేయాలన్నారు. పశువులను కిక్కిరిసినట్లు కట్టకుండా దూరం, దూరంగా కట్టాలని చెప్పారు. ముఖ్యంగా నాటు జాతి పశువుల కంటే సంకర జాతి ఆవులు, గేదెలు త్వరగా వడదెబ్బకు గురవుతాయని వాటిని తరుచూ చల్లని నీటితో తడుపుతూ ఉండాలన్నారు. ఒక పశువు రోజుకు 60 లీటర్ల నీరు తాగుతుందని, అలాగే ప్రస్తుత వేసవిలో అపరిమాణం మరింత పెరుగుతుందని, ఈమేరకు రైతులు ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. అలాగే పశువులకు తాగునీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. తగినంత పచ్చిమేత వేయడంతో పాటు అత్యధిక పోషక విలువలు కలిగిన దాణాను అందించాలని వివరించారు. వేసిన దాణాలో మినరల్‌ మిక్చర్‌ కలిపిపెట్టడం మంచిదని సూచిం చారు. అంతేకాక దాణాలో తగినంత ఉప్పుశాతం ఉండేలా చూసుకోవాలన్నారు. ఉదయం, సాయం త్రం పాలు తీసే అరగంట ముందు పశువులను చల్లని నీటితో కడిగితే పాల దిగుబడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అలాగే గొర్రెలు, మేకలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించారు. ప్రస్తుత వేసవిలో గొర్రెలు, మేకల పెంపకం చేపడుతున్న వారు వాటి సంరక్షణ కోసం పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బయట పచ్చిక బయిళ్లలో ఉదయం, సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు మేపుతూ…. మధ్యాహ్నం నీడలో విశ్రాంతి కల్పించాలన్నారు. చూడితో ఉన్న వాటిని, రెండు నెలల్లోపు పిల్లలున్న తల్లులను ఇంటి వద్దే ఉంచి ఆహారం అందించాలని మూగజీవాలకు చల్లని, పరిశుభ్రమైన నీరు అందేలా చూడాలని అన్నారు. నాటు కోళ్లను పెంచేవారు నిరంతరం గాలి తగిలెలా షెడ్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉందన్నారు. కోళ్ల మీద ఎండ వేడిమి ప్రభావం పడకుండా షెడ్ల మీద తాటి పీచుతో కప్పి తడుపుతూ ఉండాలన్నారు. అలాగే కోళ్లకు బెల్లం నీరు తాగించాలని రోధకశక్తిని పెంచడానికి విటమిన్లు కలిగిన మిశ్రమాన్ని పెట్టాలని సూచిం చారు. వ్యాధులు వ్యాపించకుండా ఎప్పటికప్పుడు వ్యాక్సిన్లు వేయించి జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన వివరించారు.

➡️