పాత పెన్షన్‌పై పార్టీల వైఖరి తెలపాలి : యుటిఎఫ్‌

ప్రజాశక్తి – కడప అర్బన్‌ సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అనంతరం సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పాత పెన్షన్‌ విధానం అవసరమని, అలాంటి పాత పెన్షన్‌ పై రాజకీయ పార్టీల వైఖరేంటో తెలపాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు కోరారు. మంగళవారం సాయంత్రం కడపలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు పోస్ట్‌ కార్డు ద్వారా తమ డిమాండ్‌ను తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భవిష్యత్తును నిర్ణయించేది తాము ఎన్నుకున్న నాయకులే అయినా తమ సమస్యలు పరిష్కరించ లేనప్పుడు వారి రాజకీయ భవిష్యత్తును నిర్ణయించేది కూడా తమ ఓటే అనే విషయం గుర్తుంచుకోవాలని తెలిపారు. అందుకే ఓట్‌ ఫర్‌ ఓపిఎస్‌ నినాదంతో ఎవరైతే పాత పెన్షన్‌ ఇస్తామని మేనిఫెస్టోలో చేర్చి అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం చేస్తారో వారికే మా ఓట్లు, మా కుటుంబ సభ్యుల ఓట్లు వేస్తామని చెప్పారు. పాత పెన్షన్‌పై ప్రస్తుత ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పారని ఎటువంటి హామీలు ఇవ్వని అనేక రాష్ట్రాలు పాత పెన్షన్‌ పునర్దరిస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో పాత పెన్షన్‌ పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి అవకాశం ఉందని, ఉద్యోగ, ఉపాధ్యాయులపై మొండిగా ముందుకు వెళుతూ న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరించపోతే ఈ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏ రాజకీయ పార్టీ అయితే పాత పెన్షన్‌ పై స్పష్టమైన హామీ ఇస్తుందో ఆ పార్టీకే మా మద్దతు ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, ఏజాస్‌ అహమ్మద్‌, నాయకులు గోపీనాథ్‌, అబ్దుల్‌ గని, హిపాజితుల్లా, సుజిత్‌ కుమార్‌, వీరనారాయణ పాల్గొన్నారు.

➡️