పింఛన్ల సొమ్మును మళ్లించిన జగన్‌

Mar 31,2024 21:37

టిడిపిలోకి ఆహ్వానిస్తున్న జీవీ ఆంజనేయులు, మక్కెన మల్లికార్జునరావు
ప్రజాశక్తి – వినుకొండ :
అవ్వ, తాతల పింఛన్ల డబ్బుని కూడా సొంతానికి మళ్లించింది కాక ఆ నెపం ఎన్నికల కమిషన్‌ పైకి నెట్టాలని చూస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై టిడిపి పల్నాడు జిల్లా అద్యక్షులు జీవీ ఆంజనేయులు ధ్వజమెత్తారు. వాలంటీర్లను వాడుకుంటూ టిడిపిపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పట్టణంలోని ఒకటో వార్డు సిద్ధార్థ నగర్‌కు చెందిన 29 కుటుంబాలు వైసిపిని వీడి టిడిపిలో చేరగా వారిని జీవీ ఆంజనేయులతోపాటు మక్కెన మల్లికార్జునరావు టిడిపి కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. అనంతరం జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ వాట్సాప్‌ గ్రూపులు, సామాజిక మాధ్యమాల్లో వైసిపి అనుకూల వాలంటీర్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. నిధుల కొరత వల్లే పింఛన్లు చేపట్టలేదే కాని వాలంటీర్లు లేకపోవడం వల్ల కాదన్నారు. ఆ డబ్బును జగన్‌ సొంత కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లించారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాగానే పింఛనును రూ.4 వేలకు పెంచుతామని చెప్పారు. వైసిపి పాలనలో వినుకొండ అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఐదేళ్లుగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వార్డుల్లో కనీస సమస్యలు కూడా పట్టించుకోలేదని విమర్శించారు. మక్కెన మాట్లాడుతూ జీవీ ఆంజనేయులు, లావు శ్రీకృష్ణదేవరాయలుపై నమ్మకంతోనే తెలుగుదేశంలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయని అన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే 29వ వార్డులో ప్రధాన సమస్యలైన డ్రెయినేజీ, బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేస్తారన్నారు. 2019లో వినుకొండ తాగునీటి పథకానికి ఆంజనేయులు రూ.160 కోట్లు తీసుకొస్తే తర్వాత ఎమ్మెల్యే అయిన బొల్లా ఆ పనులనే మూలన పడేశారని, టిడిపి అధికారంలోకి రాగానే తాగునీటి పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి పట్టణ ప్రజలకు అంకితం చేస్తామని చెప్పారు. ఇతర సమస్యలనూ పరిష్కారిస్తామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు జి.సుబ్బారావు, వి.మురళీకృష్ణ పాల్గొన్నారు.

➡️