పెన్షన్‌-టెన్షన్‌

Mar 31,2024 22:58

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : ప్రతినెలా ఒకటో తేదీన సామాజిక పింఛను పొందుతున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర సామాజిక తరగతుల వారికి ఈనెల పింఛను సొమ్ము ఎప్పుడు అందుతుందనే అంశంపై టెన్షన్‌ మొదలైంది. ఐదేళ్లుగా ఒకటో తేదీన వాలంటీర్ల ఇంటికే వచ్చి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. పలుచోట్ల వాలంటీర్ల పనితీరు వివాదస్పదం కావడం, ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో కొంత మంది చేసిన ఫిర్యాదులతో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయవద్దని ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఇందుకు ప్రత్యామ్నాయం చూసుకోవాలని ఎన్నికల కమిషన్‌ సూచించింది. గుంటూరు జిల్లాలో 2,61,598 మంది పింఛనుదారులు ఉండగా వీరికి ప్రతినెలా రూ.81,47,76,500 ప్రభుత్వం అందిస్తోంది. పల్నాడు జిల్లాలో 2,83,119 మంది లబ్ధిదారులకు రూ.84,58,51,500 అందిస్తున్నారు. ప్రతినెలా మొదటి వారంలో మూడు రోజుల పాటు పింఛను సొమ్ము ఇంటికి వచ్చి వాలంటీర్లు ఇవ్వడం వల్ల లబ్ధిదారులు చాలా వరకు సంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ సూచనలతో ప్రభుత్వం సచివాలయం ఉద్యోగుల ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఈ పంపిణీ చేపట్టనున్నారు. అయితే మంచంలో ఉన్న వృద్ధులు, కదలలేని స్థితిలో ఉన్న వికలాంగులు, పక్షవాతం తదితర అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారి గురించి ప్రభుత్వం స్పష్టతివ్వలేదు. దీంతో వారు, వారి తరుఫున బంధువులు సచివాలయం వద్దకు ఎలా వెళ్లాలా అని మధనపడుతున్నారు. అయితే మొత్తం పంపిణీలో 90 శాతం పూర్తయిన తరువాత మంచంలో ఉన్న వారికి, పూర్తి వైకల్యంతో ఉన్న వారికి సచివాలయ ఉద్యోగులే వెళ్లి ఇచ్చే అవకాశం ఇస్తారని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల తరువాత మళ్లీ కార్యాలయాలకు వెళ్లి పింఛను తీసుకోవాల్సివస్తుందని పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో పంచాయతీ కార్యాలయం, మండల కార్యాలయం, పోస్టాఫీసు, బ్యాంకులు ఇలా వేర్వేరు విధానాల ద్వారా పంపిణీ జరిగితే లబ్ధిదారులు రవాణాతో అనేక వ్యయప్రయాసలకు గురయ్యేవారు. తిరిగి మళ్లీ ఇప్పుడు ఇంటి నుంచి సచివాలయంకు వెళ్లి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడటం వల్ల కొంత మంది ఆందోళన పడుతున్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు ఎన్నికల కోడ్‌ పూర్తయ్యే వరకు ఇంటి వద్ద పంపిణీ చేయకూడదు. ఏ సచివాలయం పరిధిలోని లబ్ధిదారులు ఆ సచివాలయానికి వెళ్లి పింఛను సొమ్ము తీసుకోవాలి. ఆధార్‌ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులు తీసుకువెళ్లాలి. పింఛనుదారులు పింఛను పుస్తకం తీసుకురాకూడదు. పుస్తకంపై సిఎం ఫొటో ఉంటుంది కనుక ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధం. సచివాలయం వద్ద తొక్కిసలాటకు అవకాశం లేకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.

➡️