పేదల భూములు వారికే ఇప్పించండి: సిపిఎం

ప్రజాశక్తి-చీమకుర్తి: ఎవరూ కొనగూడదనీ, అమ్మకూడదనీ పేదల భూములపై పెత్తందారులు సాగిస్తున్న దౌర్జన్యాన్ని ఆపి, వారి భూములు వారికే అప్పగించాలని సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు డిమాండ్‌ చేశారు. మువ్వావారిపాలేనికి చెందిన పేద, దళితులకు 1977లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌ చేయించుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం భూములను మంజూరు చేసింది. ఆ భూములు పెత్తందారులు కొందరూ కౌలు పేరుతో అనుభవిస్తూ, తృణమో, ఫలమో ఇస్తూ పెత్తందారులు ఆ భూములు ఇప్పుడు మీవి కావని బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావుతో కలిసి పేద దళితులు తహశీల్దారును కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి పూసపాటి వెంకటరావు మాట్లాడుతూ పేదల భూములను వారికే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో భూమి హక్కుదారులు బి ప్రభాకర్‌, బి సుబ్బారావు, రాధ, పిచ్చయ్య, అంకమ్మరావు, లాజర్‌ పాల్గొన్నారు.

➡️