ప్రజాగళంగా లక్ష్మణరావు

Feb 10,2025 00:12

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్రంలో శాసన మండలి పునరుద్ధరణ తరువాత సుదీర్ఘకాలం పనిచేసిన ఎమ్మెల్సీల్లో కె.ఎస్‌.లక్ష్మణరావు ప్రముఖంగా నిలుస్తున్నారు. గుంటూరు హిందూ కళాశాల అధ్యాపకుడిగా పనిచేస్తూ 2007లో తొలిసారిగా శాసన మండలి సభ్యులుగా ఆయన ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన 3 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఒకసారి ఓడిపోయారు. ఐదోసారి ఈనెల 27న కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. 14 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన అన్ని తరగతుల ప్రజల గొంతుకగా పనిచేశారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, మహిళలు, అంగన్‌వాడీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలతో పాటు పెన్షనర్లు, వివిధ తరగతులకు చెందిన సమస్యలపై మండలిలో పోరాడారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించారు. 2014 వరకు కాంగ్రెస్‌, 2014 నుంచి 2019 వరకు టిడిపి, 2019 నుంచి 2024 వరకు వైసిపి, తిరిగి ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వంలో కూడా వివిధ అంశాలపై మండలి సమావేశాల్లో ప్రభుత్వాలను ప్రజా సమస్యలపై నిలదీశారు. మండలిలో ఆయా వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతోపాటు, బయట జరిగే ప్రజా ఉద్యమాల్లోనూ భాగస్వామ్యులయ్యారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనూ గుంటూరు ఛానల్‌, వరికెపుడిశెల, కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు, ఇతర సమస్యలు, పట్టణాల్లో మౌలిక వసతులు, ఆర్‌వోబిలు, ఆర్‌యుబిలు, తాగునీరు, ట్రాఫిక్‌ సమస్యలపై కూడా మండలితో పాటు గుంటూరు మునిసిపల్‌ కార్పొరేషన్‌, జిల్లా పరిషత్‌ సమావేశాల్లో, జిల్లా సమీక్ష కమిటీ (డిఆర్‌సి) సమావేశాల్లోనూ మాట్లాడుతున్నారు. లక్ష్మణరావు పోరాటం ఫలితంగా గుంటూరులో ఇప్పటికే పలు ఆర్‌వోబిలు మంజూరయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది పడుతున్న వేలాది మందికి పట్టాలు ఇప్పించేందుకు, ప్రభుత్వ భూములలో ఇళ్లు నిర్మించుకుని నివశిస్తున్న వారికి క్రమబద్ధీకరణ పట్టాలు ఇప్పించేందుకు వివిధ దశల్లో జరిగిన పోరాటాల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎ.కొండూరు మండలంలో కిడ్నీ బాధితుల సమస్యలపై మండలిలో ప్రముఖంగా ప్రస్తావించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి బాధితులను అదుకునేలా కృషి చేశారు. జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా ఈ మండలంలోని ప్రజలకు తాగునీటి పథకం మంజూరుకు ప్రభుత్వంపై వత్తిడి చేసి మంజూరు చేయించారు. గంపలగూడెం మండలంలో కట్లేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం పలుమార్లు మండలిలో ప్రస్తావించారు. ప్రభుత్వ అధికారులతో చర్చించి బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేశారు. మామిడి రైతుల సమస్యలపై ప్రభుత్వంతో చర్చించారు. మిర్చి రైతులు, సుబాబుల్‌ సాగు దారుల సమస్యలపై పలుమార్లు అధికారులతో చర్చించడం, మండలిలో ప్రస్తావించడం, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అనేక అంశాలపై నిరంతరం పోరాడుతున్నామన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజామోద నిర్ణయాలు తీసుకుంటే మద్దతు ఇస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం కొనసాగించారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే కృషి కంటే ప్రతిపక్ష పాత్ర పోషించే తనను ఎన్నుకుంటే ప్రజలందరీకి న్యాయం జరుగుతుందని కెఎస్‌.లక్ష్మణరావు చెప్పారు.
నామినేషన్‌ ప్రారంభ సభ
కెఎస్‌ లక్ష్మణరావు నామినేషన్‌ దాఖలుకు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, బి.గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రహ్మణ్యం, బొడ్డు నాగేశ్వరరావు, యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌. ప్రసాద్‌, గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాసరావు, గుంటూరు జిల్లా సహాధ్యక్షులు కుసుమ కుమారి, గ్రాడ్యు యేట్‌ నియోజకవర్గం కన్వీనర్‌ ఎం.హను మంతరావు, ఆడిట్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ టిఎల్‌ఎస్‌ఎన్‌ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొంటారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సభ ప్రారంభం అవుతుందని, 11.30 గంటల వరకు సభ జరుగుతుందని తరువాత భోజనాలు చేసి 12.30 గంటలకు ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయంకు నామినేషన్లు వేసేందుకు వెళ్లనున్నారు.
భారీ ర్యాలీగా నామినేషన్‌కు
ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి పోటి చేస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు సోమవారం నామినేషన్లు దాఖలు చేయను న్నారు. ఉదయం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగే సభలో పాల్గొని అనంతరం ర్యాలీగా కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రాజ్యాంగ నిర్మాతలు దూరదృష్టితో టీచర్లు, గ్రాడ్యు యేట్ల సమస్యలపై ప్రాతినిధ్యం కోసం ఏర్పాటు చేసిన టీచర్స్‌, గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ రాజకీయ పార్టీలు నేరుగా పోటీ చేస్తున్నాయని లక్ష్మణరావు అన్నారు. అన్ని రంగాల ప్రజలకు మండ లిలో గొంతుకగా ఉంటానని తనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. నామినేషన్‌ కార్యక్రమంలో గ్రాడ్యు యేట్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, ప్రజా సంఘాల శ్రేణులు పాల్గొనాలని కోరారు.

➡️