ప్రజా ప్రతినిధులు ఫుల్‌… అధికారులు నిల్‌

Feb 12,2024 21:03

ప్రజాశక్తి – కురుపాం  : సర్వసభ్య సమావేశానికి మండల స్థాయి అధికారులు వస్తేనే సమావేశంలో ఉండాలని, వారి ద్వితీయ శ్రేణి సిబ్బంది వస్తే వెళ్లిపోవాలని సమావేశానికి రాని అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఎంపిపి శెట్టి పద్మావతి ఎంపిడిఒకు సూచించారు. సోమవారం స్థానిక ఐకెపి కార్యాలయం వద్ద ఎంపిడిఒ ఎస్‌.అప్పారావు ఆధ్వర్యంలో ఎంపిపి అధ్యక్షతన జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వైద్యశాఖ సమీక్షకు పిలవగా, మొండెంఖల్‌ పిహెచ్‌సి వైద్యాధికారి బదులుగా ఎంపిఇహెచ్‌ఒ రావడంతో ఎంపిపి కలుగజేసుకొని మీ వద్ద ఏం సమాచారం ఉంటుందని ఈ సమావేశానికి వచ్చారని ప్రశ్నించారు. పూర్తి సమాచారం మీ వద్ద లేనప్పుడు సమావేశం నుంచి వెళ్లిపోవాలన్నారు. ఎఒ నాగేశ్వరరావు మాట్లాడే సమయంలో ఎంపిపి కలుగజేసుకొని వ్యవసాయ శాఖకు సంబంధించి కనీస సమాచారం కూడా ప్రజాప్రతినిధులకు ఇవ్వకపోవడం సమంజసం కాదని, పనితీరు మార్చుకోవాలని అన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ సేవా పథకం కింద ఆరు నెలలుగా డబ్బులు కట్టాం కానీ ఇంతవరకు పరికరాలు రాలేదని, పరికరాలైన ఇవ్వాలి లేదా డబ్బులు అయినా తిరిగి ఇవ్వాలని గుజ్జువాయి సర్పంచ్‌ హెచ్‌.నాగేశ్వరరావు ప్రశ్నించగా, ఉన్నతాధికారులతో మాట్లాడి పూర్తి సమాచారం ఇస్తానని అన్నారు. కురుపాం ఎంపిటిసి వి.బంగారు నాయుడు మాట్లాడుతూ స్థానిక జిల్లా పరిషత్‌ పాఠశాల భవనం నిర్మించి చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు బిల్లు కాలేదని అధికారులకు తెలియజేసినా త్వరగా బిల్లు అయ్యేటట్లు చూడాలని ఎంఇఒ ఎన్‌.సత్యనారాయణ కోరారు. మిగతా శాఖల వారు చేసినవి, భవిష్యత్తు కార్యక్రమాలపై ప్రజా ప్రతినిధులకు సమాచారం అందించారు. మహిళా ప్రజా ప్రతినిధులకు బదులుగా వారి భర్తలు అధికారులను ప్రశ్నించినా మండల ప్రజా ప్రతినిధులు చూసీ చూడనట్లు వ్యవహరించడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ, వ్యవసాయ, విద్యా, పశు వైద్య శాఖలు, ఆర్‌డబ్ల్యుఎస్‌, వైకెపి, ఐసిడిఎస్‌, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌ శాఖ మండలాల అధికారులు తప్ప మిగతా శాఖ అధికారులెవరూ సమావేశానికి హాజరు కాలేదు. సమావేశంలో జెడ్‌పిటిసి సభ్యులు జి.సుజాత, వైస్‌ ఎంపిపిలు అన్నాజీరావు, రంగారావు, మండల కో ఆప్షన్‌ సభ్యులు షేక్‌ జిలాని, మండలంలో గల పలువురు ఎంపిటిసి సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు.

➡️