ప్రభుత్వ కార్యక్రమమా? పార్టీ కార్యక్రమమా?

ప్రజాశక్తి-త్రిపురాంతకం: త్రిపురాంతకంలో శనివారం ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమం ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా పార్టీ కార్యక్రమంలా సాగింది. కార్యక్రమం ప్రారంభంలో వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తాటిపర్తి చంద్రశేఖర్‌ ఎన్నికల క్యాంపెయిన్‌ పాటలతో హోరెత్తించారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంలోనూ నియోజకవర్గ ఎమ్మెల్యే, మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ప్రాధాన్యత తగ్గించారు. పేరుకు చిన్న ఫొటోని ముద్రించి ఏ అధికారం లేని కేవలం ఇన్‌ఛార్జిగా వచ్చిన చంద్రశేఖర్‌ ఫొటోలను మాత్రం పెద్దవిగా ప్రచురించారు. దీనికి తోడు కార్యక్రమానికి మహిళలు ఎక్కువగా రావడానికి ఇష్ట పడకపోవడంతో సభా వేదిక దగ్గర ఉన్న రిజిస్టర్లలో వచ్చి సంతకాలు పెడితేనే ఆసరా నగదు తమ ఖాతాల్లో జమ అవుతాయి. లేకుంటే జమ కావు అంటూ వివోఏల ద్వారా డ్వాక్రా మహిళలకు బెదిరింపులు జారీ చేశారు. దీంతో గత్యంతరం లేక మిరప కోత రోజు వారి కూలి రూ.400 సైతం వదులుకొని మహిళలు త్రిపురాంతకం రావాల్సివచ్చిందని తెలిపారు. తీరా ఇక్కడకు వచ్చిన తర్వాత మా చేత ఎలాంటి సంతకాలు చేయించుకోలేదని తెలిపారు. ఆసరా చెక్కుల కార్యక్రమం త్రిపురాంతకంలోని ఎంపిడివో కార్యాలయ ఆవరణలో జరగగా అక్కడే ఉన్న వైఎస్సార్‌ విగ్రహానికి తాటిపర్తి చంద్రశేఖర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అందరూ వైసీపీ నాయకులే పాల్గొన్నారు తప్ప అధికారులెవరూ పాల్గొనలేదు. దీంతో ఇది పార్టీ కార్యక్రమంగా మారింది. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్‌ సింగారెడ్డి నాగమణి, ఎంపిపి కోట్ల సుబ్బారెడ్డి, జడ్పిటిసి మాకం జాన్‌పాల్‌, సర్పంచ్‌ పొన్నా వెంకటలక్ష్మి, వైసీపీ మండల కన్వీనర్‌ సింగారెడ్డి పోలిరెడ్డి, నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, వైఎస్సార్‌ ఐకెపి ఏసీ లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

➡️