ప్రభుత్వ విద్యను నిలబెట్టుకుంటేనే భవిష్యత్‌

May 27,2024 21:49

  శేషగిరి వర్థంతి సభలో విఠపు బాలసుబ్రమణ్యం

ప్రజాశక్తి ప్రతినిధి-విజయనగరం :   నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యాపార విధానంలో జనంతో కలిసి ప్రభుత్వ విద్యను, బడులకు కాపాడుకోవడం ద్వారానే పేదలకు విద్య, మనకు భవిష్యత్‌ ఉంటుందని శాసనమండలి పిడిఎఫ్‌ మాజీ ఫ్లోర్‌ లీడర్‌ విఠపు.బాలసుబ్రమణ్యం అన్నారు. యుటిఎఫ్‌ ఉద్యమ నేత కోరెడ్ల శేషగిరి 3వ వర్థంతి సోమవారం శేషగిరి విజ్ఞాన కేంద్ర భవనంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన బాలసుబ్రహ్మణ్యం ‘విద్యారంగంలో పరిణామాలు.. సవాళ్లు.. కర్తవ్యాలు’ అనే అంశంపై స్మారకోపన్యాసం చేశారు. ముందుగా శేషగిరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రజాశక్తి ముద్రించిన ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు.అనంతరం యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు రమేష్‌ చంద్ర పట్నాయక్‌ అధ్యక్షతన జరిగిన సదస్సులో బాలసుబ్రహ్మణ్యం ప్రసంగించారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ శేషగిరి పేరిట సంఘ నిర్మాణమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అన్నారు. విద్యారంగంలో తీవ్రమైన అసమానతలు ఉన్నాయని అన్నారు. ప్రైవేట్‌ స్కూళ్లలోని పిల్లలకు ఎక్కువ మార్కులు రావడం వెనుక వారి తల్లిదండ్రుల సామాజిక, ఆర్ధిక పరిస్థితులే కారణమని అన్నారు. అటువంటి పరిస్థితులను పక్కనబెట్టి మాట్లాడడం సరికాదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 12శాతం మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతుండగా మన దేశంలో 40శాతం మంది చదువుతున్నట్టు బ్రిటిష్‌ కౌన్సిల్‌ తన రిపోర్టులో పేర్కొందని వివరించారు. మనదేశంలోని విద్యాప్రమాణాలు మిగిలిన దేశాలకన్నా తక్కువగా ఉండడమే ఇందుకు కారణమని వివరించారు.

ధనిక కుటుంబాలకు చెందిన 10శాతం మంది విద్యార్థులు ఇంటర్నేషనల్‌ స్కూళ్ళలో ఉన్నారని, 40శాతం మంది మధ్య తరగతి విద్యార్థులు కార్పొరేట్‌ స్కూళ్లలో ఉన్నారని, మిగిలిన 50శాతం మంది పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని తెలిపారు. అందువల్లే ప్రభుత్వ విద్యపై ప్రశ్నించే పరిస్థితి లేక ప్రభుత్వ పాఠశాలలు నిర్లక్యానికి గురవుతున్నాయని అన్నారు. మిగిలిన దేశాల్లో కామన్‌ స్కూల్స్‌ మాత్రమే ఉంటాయని, అందువల్లే ఆ దేశాల్లో ఆర్థిక, సామజిక అంతరాలు కనిపించబోవన్నారు. ఈ అంతరాల వల్ల సంస్కతి, సంప్రదాయాలు కూడా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కామన్‌ స్కూల్స్‌ విధానం అమలు చేయాల్సిన ప్రభుత్వాలు ఎన్నికల్లో ఓట్లకోసం పథకాలను మాత్రమే ఆశగా చూపుతున్నాయని విమర్శించారు. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పేదలు, వారి పిల్లలేనన్నారు. మరో వైపు పాలకుల విధానాల వల్ల విద్య వ్యాపారంగా మారిపోయిందన్నారు. ప్రవేటు విద్యకు అనుగుణంగా విద్యా విధానాలు రూపొందించడం వల్ల త్వరలోనే అదానీ స్కూల్స్‌ వచ్చే అవకాశం లేకపోలేదన్నారు. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,356 సింగిల్‌ టీచర్స్‌ స్కూళ్లను ఎత్తి వేస్తారని తెలిపారు. ఇప్పటికే 26వేల పోస్టులు కనుమరుగయ్యాయని తెలిపారు. ప్రభుత్వమే సర్కారు విద్యపై నమ్మకం లేకుండా చేస్తుందన్నారు. గత ఏడాది ప్రభుత్వ బడుల్లో 3,59,000 మంది విద్యార్థులు తగ్గి పోయారని తెలిపారు. ఈ నేపధ్యంలో విద్యార్థుల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసి, వారి తల్లిదండ్రులతో కలిసి ప్రభుత్వ బడులను బతికించుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు, రాష్ట్రనాయకులు కె.విజయగౌరి, డి.రాము, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా వెంకటేష్‌, ఎపిటిఎఫ్‌ 257 నాయకులు శ్రీనివాసరావు, పిఅర్‌టియు నాయకులు బి.శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️