బాధితులకు మెరుగైన వైద్యం అందజేయాలి

Feb 11,2024 00:39

మేయ‌ర్‌ను నిల‌దీస్తున్న సిపిఐ, సిపిఎం నాయ‌కులు
ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : కొన్ని రోజులుగా మున్సిపాలిటీ నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోలేదని మచిలీపట్నం ఎంపి వి. బాలశౌరి విమర్శించారు. జిజిహెచ్‌లో శనివారం ఆయన డయేరియా బాధితులను పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే పద్మ అనే మహిళ మతిచెందిందన్నారు. జనసేన పార్టీ బాధితులకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. కమిషనర్‌ పరామర్శ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితులను నగర పాలక సంస్థ కమిషనర్‌ కీర్తి చేకూరి పరామర్శించారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆస్పత్రి అధికారులను కోరారు.
రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని గుంటూరులో ఉన్నా నగరంలోని ఇటువంటి సంఘటన జరగటం బాధాకరమని, ప్రజలకు కనీసం స్వచ్ఛమైన తాగునీరు అందలించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని టిడిపి, జనసేన నాయకులు ఆస్పత్రి ఎదుట నిరసన తెలిపారు. ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ ఆరోగ్య శాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని టిడిపి నాయకులు కనపర్తి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. నిరసనలో జనసేన నాయకులు నెరెళ్లసురేష్‌, ఆళ్ల హరి పాల్గొన్నారు.
సంగడిగుంట, శ్రీనగర్‌ వివిధ ప్రాంతాల్లో ప్రజలు కలుషిత నీరు తాగడం వల్ల 30 మంది అనారోగ్య బారిన పడి చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 లక్షలు ఎక్స్‌ గ్రేషియా ఇచ్చి న్యాయం చేయాలని టిడిపి పశ్చిమ ఇన్‌ఛార్జి కోవెలమూడి రవీంద్ర డిమాండ్‌ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించి అధికారులతో మాట్లాడారు. అధికారుల వైఫల్యం వల్లే డయేరియా ప్రభలిందని టిడిపి తూర్పు నియోజకవర్గం ఇన్‌ఛార్జి నశీర్‌ అహ్మద్‌వ అన్నారు. ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. అనంతరం కమిషనర్‌ను ఆయన నిలదీశారు. ముందస్తుజాగ్రత్తలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు.
మేయర్‌ కావటి మనోహర్‌ నాయుడు గుంటూరు నగరాన్ని చేతిలో పెట్టుకొని అధికారులను డమ్మీగా మార్చి ప్రజల సౌకర్యాలను నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్‌ నగర అధ్యక్షులు ఉస్మాన్‌ విమర్శించారు. డయేరియా వల్ల ఇద్దరు చనిపోవడం, 30 మంది అస్వస్థతకు గురయినా మేయర్‌ ఈ ఘటనను చాలాతేలిక భావంతో మాట్లాడటం సరికాదన్నారు. బాధితేలపే పిసిసి ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, నగర ఉపాధ్యక్షులు చెన్నం శెట్టి సాంబశివరావు, సయ్యద్‌ జానీ గోల్డ్‌, మీరు మెహబూబలి పరామర్శించారు.

➡️