బాధితుల సంఖ్య తగ్గుముఖం : కలెక్టర్‌

Feb 13,2024 23:26

ప్రజాశక్తి-గుంటూరు : నగరంలో ప్రస్తుతం వాంతులు, విరోచనాలు తదితర అస్వస్థత లక్షణాలతో వున్నవారి సంఖ్య తగ్గుముఖం పట్టిందని, పూర్తిస్థాయిలో తగ్గేవరకు ప్రత్యేక సర్వే బృందాలు ఇంటింటికి వెళ్లి ముందస్తు జాగ్రత్త చర్యలు తెలియజెప్పి, ఆత్మస్థైర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలక్టరేట్‌లోని ఎస్‌.ఆర్‌.శంకరన్‌ హాల్‌లో వైద్యారోగ్య శాఖ, మున్సిపల్‌, ఇంటింటి సర్వే కోసం ఏర్పాటు చేసిన బృందాలతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. వాంతులు, విరోచనాల లక్షణాలున్న వారిని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక సర్వే బృందాలు వైద్య ఆరోగ్య శాఖ అందించే కరపత్రాలను, అవసరమైన మందులను పంపిణీ చేయడంతో పాటు అస్వస్థత లక్షణాలతో వున్న వారికి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అస్వస్థతకు గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదని, తాగునీటి శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి వున్నందున ప్రస్తుతం నగరపాలక సంస్థ ట్యాంకర్ల సరఫరా చేస్తున్న తాగునీటిని మాత్రమే కాచి చల్చార్చి తాగాలని అన్నారు. కొద్దిపాటి అస్వస్థ లక్షణాలున్నా ప్రత్యేక మెడికల్‌ క్యాంపులకు వచ్చి వైద్య సేవలు పొందాలని ప్రజలకు తెలియజెప్పాలని, లక్షణాలను బట్టి స్థానిక ప్రాథమిక వైద్య కేంద్రం, జిల్లా ఆసుపత్రులలో పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తారాన్ని అవగాహన కల్పించాలని సూచించారు. సర్వే బృందాల పర్యవేక్షణ అధికారులు క్షేత్రస్థాయిలో గుర్తించిన పారిశుధ్యం, తాగునీటి పైప్‌ లైన్లకు సంబంధించిన సమస్యలను ఎప్పటికప్పుడు నగరపాలక సంస్థ అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. సమావేశంలో నగర కమిషనర్‌ కీర్తి చేకూరి, ప్రత్యేకాధికారి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ ప్రఖార్‌జైన్‌, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్‌ విజయలక్ష్మీ, జాయింట్‌ డైరెక్టర్లు డాక్టర్‌ టి.రమేష్‌, డాక్టర్‌ నిర్మలాగ్లోరి, రీజనల్‌ డైరెక్టర్‌ శోభారాణి జిఎంసి అధికారులు పాల్గొన్నారు.

➡️