బాబు ష్యూరిటీ ఎవరికో?

Feb 13,2024 21:22

ప్రజాశక్తి – సాలూరు : నియోజకవర్గ టిడిపి అభ్యర్థి విషయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు భరోసా ఎవరికి లభిస్తుందనే సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. పార్టీ నాయకత్వం సర్వేల మీద సర్వేలు చేస్తున్నా అభ్యర్థి ఎంపికపై అధిష్టానం ఏకాభిప్రాయానికి రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ ఇంఛార్జిగా గుమ్మిడి సంధ్యారాణి గడిచిన ఐదేళ్లుగా కొనసాగుతున్నారు. ఇంఛార్జిగా ఆమె ఉన్నప్పటికీ ఆమె అభ్యర్ధిత్వం పట్ల నియోజకవర్గ పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడం పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. పార్టీలో ఆమెకు మద్దతు తెలియజేస్తున్న వారి కన్నా వ్యతిరేకంగా ఉన్న వారి శాతం ఎక్కువగా ఉండడంతో అధిష్టానం ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మరో గిరిజన నాయకురాలు, రిటైర్డ్‌ టీచర్‌ మోజూరు తేజోవతి తెరపైకి వచ్చారు. ఆమెకు బహిరంగంగానే మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌, మక్కువ మండల సీనియర్‌ నాయకులు పెంట తిరుపతి రావు మద్దతు పలుకుతున్నారు. లోపాయికారీగా మిగిలిన మండలాలకు చెందిన కొంతమంది కీలక నాయకులు కూడా మద్దతు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నియోజకవర్గ ఇంఛార్జి సంధ్యారాణితో కలిసి పని చేస్తున్నట్లు కనిపిస్తున్న నాయకులు కూడా తెరవెనుక నుంచి తేజోవతికి అండగా వుంటామని భరోసా ఇస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అధిస్టానం ఎవరికి టికెట్‌ ఇస్తే వారి గెలుపునకే పని చేస్తామని చెపుతున్న వారు కూడా పార్టీ లో కనిపిస్తున్నారు. పార్టీలో సంధ్యారాణికి మద్దతుగా నిలుస్తున్న ఒక గ్రూపు నాయకులు, తేజోవతికి అండగా నిలిచిన మరో గ్రూపు నాయకులు ఉన్నారు. వీరితో పాటు తటస్థులైన కొంతమంది నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. జీరో నుంచి మొదలైన ఆశావహి తేజోవతి ప్రస్థానం పార్టీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న పరిస్థితికి చేరింది. ఆమె కూడా ఉన్నత విద్యావంతురాలు, సామాజిక, రాజకీయ అంశాలపై అవగాహన కలిగిన మహిళా నాయకురాలు కావడంతో పార్టీ నాయకత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందనే చర్చ మొదలైంది. బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జి బేజీనాయన ఆశీస్సులు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌ దేవ్‌ మద్దతు తేజోవతికి ఉండడం వల్ల ఆమె అభ్యర్ధి అయితే గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా మరోవైపు జరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠకు ఎప్పుడు తెరపడుతుందోనని ఎదురు చూస్తున్నారు. ఈనెల 14న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ బాబు టిడిపి ఎన్నికల శంఖారావం పూరించడానికి పట్టణానికి వస్తున్నారు. ఈ సభ విజయవంతానికి ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారు. లోకేష్‌ పర్యటనతోనైనా అభ్యర్థి విషయంలో స్పష్టత వస్తుందనే నమ్మకంతో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అయితే పార్టీ అభ్యర్థి ఎంపికలో అధినేత చంద్రబాబు నాయుడుదే తుది నిర్ణయమన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతవరకు నిర్వహించిన పార్టీ సర్వేల్లో తేలిన అంశాలు, స్థానిక సామాజిక, రాజకీయ పరిస్థితులు, అధికారపార్టీ అభ్యర్థి ఎవరనే అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు నాయుడే అభ్యర్థులను ప్రకటిస్తారని తెలుస్తోంది. అంతవరకు చంద్రబాబు ష్యూరిటీ ఎవరికనేది సస్పెన్స్‌గానే మిగిలిపోతుంది.

➡️